హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలో ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి కొత్తగా 50 వైద్య కళాశాలల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 17 కళాశాలలు తెలుగు రాష్ట్రాల్లోనివే ఉండడం గమనార్హం. ఇందులో తెలంగాణ మెజారిటీ వాటా దక్కించుకుంది. తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 12 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఐదు మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
తెలంగాణలో మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, #హదరాబాద్, జనగాంలలో నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమీప బంధువులకు చెందిన అరుంధతి ట్రస్ట్, మేడ్చల్‌లో సిీఎంఆర్ ట్రస్ట్‌లకు కేంద్రం అనుమతులిచ్చింది. వరంగల్‌లో ఫాదర్ కొలంబో ట్రస్ట్‌కు వైద్య కళాశాలకు అనుమతి రాగా శాసనమండలి సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమా ట్రస్ట్‌కు ఘట్‌కేసర్‌లో కళాశాల ప్రారంభానికి అనుమతి లభించింది. మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్నాయి.
కరీంనగర్‌లో ప్రభుత్వ కళాశాలకు అనుమతి లభించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఒక్కో కళాశాలలో 100 సీట్లకు అనుమతి రాగా ఈ సంవత్సరం తెలంగాణాలో అదనంగా 1200 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో
ఏపీలోని ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహంద్రవరం, విజయనగరం జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ ఐదు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటుకు ఆమోదం లభించింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ప్రారంభం కానున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.