అమరావతి, ఆంధ్రప్రభ : వచ్చే నెల మేలో అందించనున్న డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ ఆర్ధిక సహాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులందరూ అందుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు (సీసీఆర్పీ) కార్డులు అందేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈనెల 1 నుంచి 30 వరకు సీసీఆర్పీ కార్డుల జారీపై ఆర్బీకేల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలు రైతులంతా సమీపంలోని ఆర్బీకేలను సంప్రదించి పూర్తి వివరాలు అందచేయాల్సి ఉంటు-ంది. కౌలుకు తీసుకుని పొలాలను సాగు చేస్తున్నట్టు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారణ చేసుకున్నాక పూర్తి వివరాలను సీసీఆర్సీ పోర్టల్‌లో నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కౌలు వివరాలను నమోద చేశాక సాగుచేస్తున్న పంట వివరాలను కూడా తప్పనిసరిగా ఈ-క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఈ-క్రాప్ లేకపోతే రైతు భరోసా వర్తించదు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈ నెలలో ఆన్ లైన్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి మే 1 నుంచి అర్హత ఉన్న వారందరికీ కార్డులు అందచేయనున్నారు.
అదేనెలలో ప్రభుత్వం అందచేసే రైతు భరోసా ఆర్ధికసాయాన్ని కొత్తగా పోర్టల్ లో నమోదు చేయించుకున్న కౌలు రైతులందరూ అందుకునే అవకాశం ఉంటుంది. గడిచిన మూడేళ్ళుగా అర్హత ఉండీ సాంకేతిక కారణాలతో రైతు భరోసా అందుకోని వారందరినీ నిబంధనల మేరకు అర్హులుగా గుర్తించేందుకు అవసరమైన ఆన్ లైన్ ప్రక్రియను కూడా నూటిని నూరుశాతం పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు వివిధ కారణాలతో ఈ పథకంలో లబ్దిదారులుగా లేని రైతులు రైతు భరోసా పోర్టల్‌లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేష్రన్ మాడ్యూల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఆర్బీకేల్లోని వ్యవసాయ సహాయకులను (వీఏఏలను) సంప్రదించాలి.. అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు కూడా రైతు భరోసా వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి వివరాలను సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఎ)ల నుంచి ఆర్బీకేలు సేకరిస్తున్నాయి.. అనర్హుల తొలగింపుతో పాటు కొత్తగా అర్హుల నమోదునంతా వీలైనంత త్వరితగతిన పూర్తి చేసి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆమోదానికి పంపించనున్నారు. ఏప్రిల్ 30న అర్హుల జాబితాను సిద్ధం చేసి రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మూడు విడతల్లో రూ 13.5 వేలు..
డాక్టర్ వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ 13,500 పెట్టు బడి సాయంగా అందచేస్తున్నాయి. ప్రతి ఏడాదిలో మేలో తొలివిడతలో రూ.7,500, ఆ తరువాత రబీలో రూ 4 వేలు, ఖరీప్ పంట చేతికందే సమయంలో మరో రూ.2 వేలు అందచేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకునే రైతులకు అందచేసే పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం కింద 2019-20లో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు, 2020-21లో 51.59 లక్షల కుటుంబాలకు రూ.6,928 కోట్లు, 2021-22లో 52.38 లక్షల రైతు కుటుంబాలకు రూ.7,016.59 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు పెట్టుబడి సాయంగా అందింది. గడిచిన మూడేళ్లలో రూ.20,117.59 కోట్లను ఈ పథకం కింద సాయంగా అందించగా.. ఈ ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.7,020 కోట్ల కేటాయింపులు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..