అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్రంలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖాయమైంది. సెప్టెంబర్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. వినాయక చవితి తర్వాత సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబరు రెండోవారంలో సమావేశాలను నిర్వహించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మొదటి వారంలో లండన్ పర్యటనకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
సెప్టెంబరు 2వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంరతం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అందుకే అప్పుడు సాధ్యం కాదని భావిస్తున్నారని తెలుస్తోంది. సీఎం విదేశాల నుంచి వచ్చాక కేబినెట్ సమావేశం నిర్వహించి, అందులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు.
10 నుండి 15 రోజులపాటు నిర్వహణ
ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే 10 నుంచి 15 రోజుల పాటూ నిర్వహించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, షెడ్యూల్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. సెప్టెంబర్‌లో సమావేశాలు ఖాయమని.. కాకపోతే నాలుగైదు రోజులు అటూ ఇటుగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏర్పాటు చేసే మంత్రివర్గ సమావేశంలో సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపైనా చర్చిస్తారు. ఈ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు తీసుకోస్తారా అనేది చూడాల్సి ఉంది.