తాడేపల్లి (ప్రభ న్యూస్) – మంగళగిరి నుండి జై భీమ్ రావు భారత్ పార్టీ తరుపున ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడె జడ శ్రావణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈమేరకు సోమవారం తాడేపల్లి పట్టణంలోని ఆర్. సి. ఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, దళితుల కోసం 2019 నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీకి దిగుతున్నానని తెలిపారు. నారా లోకేష్ కి మంగళగిరి లో ఓటు అడిగే హక్కు లేదని, ఎన్నికల ముగిసిన తెల్లవారి నుంచి అపాయింట్ కూడా ఇవ్వరని అన్నారు.
వైసీపీ నుంచి రాజకీయాలు అంటే తెలియని ఒక మాజీ మంత్రి కోడలు, మాజీ ఎమ్మెల్యే కూతురు లావణ్య పోటీ చేస్తుందన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వంలో 2 943 మంది దళితులు మరణిస్తే ఒక్కరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని, అదే సమయంలో సబ్ ప్లాన్ నిధులు 73 వేల కోట్లు తరలించినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం కూడా దళితులను మోసం చేసిందని అన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోవలా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు అవకాశవాదులకు అంబేద్కర్ వాదులకు జరిగే పోరాటం అన్నారు. బూర్జువా పార్టీలు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు చేసి ఓటు 5 వేలు, 10 వేలుకు కొనాలని చూస్తున్నారని, ఓటు ను అమ్ముకోవద్దని, ఆత్మ గౌరవంతో మన ఓటు హక్కు వినియోగించుకుందాం అని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణంలోని మెయిన్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పేదలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.