Monday, November 18, 2024

Assembly – అంధ్ర‌ప్ర‌వేశ్ బ‌డ్జెట్ స‌మావేశాలు – ఆరో రోజు రౌండ‌ప్

జగనన్న కాలనీలపై అసెంబ్లీలో చర్చ
అధికారుల నివేదికలకు, వాస్తవాలకు తేడా ఉంది
పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్పీక‌ర్ సూచ‌న

అమరావతి: జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు . అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని.. అధికారులు ఇలాంటి పద్ధతులు వెంటనే మానుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాల ఆరో రోజైన నేడు ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో జగనన్న కాలనీ అక్రమాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొలుస పార్ధసారధి సమాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్బంగా జోక్యం చేసుకున్న‌స్పీక‌ర్ అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు..

విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది: మంత్రి కొలుసు పార్థ సారథి

జగనన్న హౌసింగ్ ఇళ్లల్లో పూర్తి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు.జగనన్న కాలనీల్లో డిపార్ట్‌మెంట్..విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

- Advertisement -

ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు: ఎమ్మెల్యే గణ‌బాబు

హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణ‌బాబు అన్నారు. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హౌసింగ్ ఇళ్లా నిర్మాణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అధ్వాన్నంగా జగనన్న కాలనీల నిర్మాణాలు: ఎమ్మల్యే వరద రాజుల రెడ్డి

జగనన్న కాలనీల నిర్మాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రొద్దుటూరు ఎమ్మల్యే వరద రాజుల రెడ్డి చెప్పారు. చిన్న వర్షాలకు ఇల్లు కూలిపోయేలా ఉన్నాయని తెలిపారు.జగనన్న కాలనీల్లో కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం కాంట్రాక్టర్లు దండుకున్నారని మండిపడ్డారు.

ఆర్టీసీలో డ్రైవ‌ర్ల‌, కండ‌క్ట‌ర్ల కొర‌త ఉంది..

ఏపీఎస్‌ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. ఈహెచ్ ఎస్ ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని త‌మ‌ దృష్టికి వచ్చిందని వివరించారు.. అయితే, ఉద్యోగుల మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు.. కానీ, గత ప్రభుత్వంలో బస్టాండులకు నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టతరం అయ్యిందని.. రాబోయే రోజుల్లో బస్టాండులు ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇక, ఆన్ కాల్ డ్రైవర్లు సరైన విధానం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఆర్టీసీ డ్రైవర్లుగా అనుభవం లేని వారిని తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు.. మరోవైపు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ బస్టాండును పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.. వర్షం కురిసిందంటే చాలు గుడివాడ బస్టాండ్‌ నీటమునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆ ఇబ్బంది మళ్లీ రాకుండా బస్టాండ్‌ను పునర్నిర్మించాలని శాసన సభలో విజ్ఞప్తి చేశారు..

స్వ‌ల్ప కాలిక చ‌ర్చ‌

నేడు స‌భ‌లో వివిధ అంశాల‌పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌రిగింది.. డివిజినల్ రైల్వే యూసర్స్ కన్సల్టేటివ్ కమిటీలో ప్రతినిధిగా ఎంఎల్ఏలలో ఒకరిని ఎన్నుకోవడానికి వీలుగా అసెంబ్లీ లో ప్ర‌తిపాద‌న ఉంచారు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.. దీనిపై చ‌ర్చ జ‌రిపి ఓకే చెప్పారు…

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ పంచాయితీరాజ్ డిమాండ్ కింద 11,846.92 కోట్ల గ్రాంట్.. గ్రామీణాభివృద్ధి గ్రాంట్ కింద 7949.87 కోట్ల గ్రాంటు.. అటవీ, సాంకేతిక, నైపుణ్య, పర్యావరణం కింద 687.58 కోట్ల గ్రాంట్స్‌ సభ ముందు ఉంచారు. దీనిపై ఎటువంటి చ‌ర్చ లేకుండానే ఆమోద ముద్ర వేశారు.

మంత్రి నారా లోకేష్.. పాఠశాల విద్య కింద 29,909.31 కోట్ల గ్రాంట్.. ఉన్నతవిద్య కింద 2326.68 కోట్ల గ్రాంట్.. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కింద 1217.16 కోట్ల గ్రాంట్.. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ కింద 500.51 కోట్ల గ్రాంట్ ఆమోదం కోసం స‌భ‌లో ప్ర‌తిపాదించారు..దీనిపై చ‌ర్చ జ‌రిపి నిధులు విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు

మంత్రి సత్యకుమార్ యాదవ్.. వైద్యం ఆరోగ్యం కింద 18421.04 కోట్ల గ్రాంట్.. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.. సోషల్ వెల్ఫేర్ కింద 10,400.84 కోట్ల గ్రాంట్.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. మహిళా, శిశు సంక్షేమం కింద 4285.95 కోట్ల గ్రాంట్.. ఆదివాసీ సంక్షేమం కింద 4541.86 కోట్ల గ్రాంట్.. లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ గ్రాంట్ ఎన్ఎండీ ఫరూఖ్.. మైనారిటీల సంక్షేమం కింద 2808.75 కోట్ల గ్రాంట్.. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ 1227 కోట్లు గ్రాంట్ కోసం స‌భ‌లో పెట్టిన బిల్లుల‌ను సైతం ఓకే చేశారు. మెడిక‌ల్ యూనివ‌ర్శిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీగా పేరు మారుస్తూ అసెంబ్లీ నిర్ణ‌యం తీసుకుంది.

అసెంబ్లీలో ఆరు బిల్లులు

ఈ రోజు స‌భ‌లో మొత్తం స‌భ‌లో ఆరు బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టారు. ఏపీ పంచాయితీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్‌ లా సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, .. ఏపీ ఆయుర్వేదిక్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, . ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024 ను ఆయా మంత్రులు స‌భ ముందుంచారు.. వాటిపై కూడా స్వ‌ల్ప‌కాలికి చ‌ర్చ జ‌రిపి ఆమోద ముద్ర వేశారు.

ఇకపై ఎంతమంది పిల్లలున్నా పోటీకి అర్హులే..
పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంతమంది పిల్లలున్నా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులేనని.. జనాభా వృద్ధిరేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ చట్ట సవరణ చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లు 2024 కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
బిల్లు ఆమోదం కోసం మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించారు. జనాభా వృద్ది రేటు పెంపుదలలో భాగంగానే చట్టంలో మార్పులు తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. శాసనమండలి ఆమోదం తర్వాత జీవో జారీ చేయగానే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. గతంలో ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం ఉంటే పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement