Saturday, October 19, 2024

Kadapa | టీడీపీ నగర అధ్యక్షుడిపై హత్యాయత్నం

కడప, అక్టోబర్ 19 (ఆంధ్రప్రభ) : కడప నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు సానపు రెడ్డి శివకొండారెడ్డిపై గుర్తుతెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. హత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్సర సర్కిల్ నుంచి స్కూటీలో స్వగృహానికి వెళ్తున్న శివకొండారెడ్డిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో విపరీతంగా కొట్టారు. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కడప నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కడప నగర టీడీపీ అధ్యక్షుడు సానపు రెడ్డి శివ కొండారెడ్డి ఇవాళ‌ ఉదయం 6.30 గంటల సమయంలో తన ఇంటి నుంచి స్కూటీ వాహనంలో అప్సర సర్కిల్ కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మానస కల్యాణ మండపం సమీపంలోకి రాగానే ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి వెనుక నుంచి దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.

శివ కొండారెడ్డి కిందపడి కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పారిపోయారు. అప్పటికే తీవ్ర రక్త గాయాలతో ఉన్న శివ కొండారెడ్డిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు రిమ్స్ కు చేరుకున్నారు.

- Advertisement -

కడప టీడీపీ నేతలు ఎస్ గోవర్ధన్ రెడ్డి, బి హరి ప్రసాద్, నియోజకవర్గ మాజీ ఇంచార్జీ అమీర్ బాబు, ఆలంఖాన్ పల్లి లక్ష్మీరెడ్డి, తెలుగు యువత నగర మాజీ అధ్యక్షులు మేకల వెంకటేష్ యాదవ్, 10వ డివిజన్ ఇంచార్జ్ పట్నం వెంకటరమణలు శివ కొండారెడ్డిని పరామర్శించారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. రాజకీయ కక్షతో దాడి జరిగిందా ? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

పూర్తిస్థాయి విచారణ జరిపించాలి..: శివ కొండా రెడ్డి
తనపై జరిగిన దాడి వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని బాధితుడు, టీడీపీ కడప నగర అధ్యక్షుడు శివకొండా రెడ్డి డిమాండ్ చేశారు. తన రాజకీయ ఎదుగులను చూసి ఓర్వలేకనే కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడి విషయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement