వసతి అధ్వానం!
డొంకరాయి ఆశ్రమ పాఠశాలలో ఇంకా దారుణం
మరుగుదొడ్లకు డోర్లు లేక విద్యార్థుల అవస్థలు
అందుబాటులో లేని ఆరోగ్య కార్యకర్త
పట్టించుకోని ఐటీడీఏ అధికారులు
ఆంధ్రప్రభ స్మార్ట్, డొంకరాయి, (ఏఎస్‌ఆర్ జిల్లా), : రంపచోడవరం ఐటీడీఏ పరిధి మన్యంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాళ్లు కనీస వసతులు లేక అధ్వానంగా మారాయి. భద్రత లేని భవనాల్లో పిల్లలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. అల్లూరి జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నాడు నేడు అంటూ గత ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై దృష్టి సారించినప్పటికీ కొన్ని వసతి గృహాలను విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి పైసా నిధులు రాకపోవడంతో హాస్టళ్లలో వసత కల్పన కష్టంగా మారింది. కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి వసతి భవనాల మరమ్మతులు చేపట్టి కనీసం మౌలిక వసతులపై దృష్టి సారించాలని విద్యార్ధినులు కోరుతున్నారు.
డొంకరాయి ఆశ్రమ పాఠశాల పరిస్థితి దయనీయం
వైరామవరం మండలంలోని డొంకరాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, వసతి గృహాల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ఈ వసతి గృహానికి గత ప్రభుత్వంలో ‘నాడు నేడు’లో కొన్ని పనులకు నిధులు మంజూరైనప్పటికీ నేటీకి ఆ పనులు పూర్తి కాలేదు. ఈ వసతి గృహానికి అనుబంధంగా ఉండే మరుగుదొడ్ల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మరుగుదొడ్లకు ఊడిపోయిన తలుపులు, వసతి గృహ గదులకు విరిగిన కిటికీలు.. విరిగిపోయిన తలుపులు దర్శనమిస్తున్నాయి. మరుగుదొడ్ల పక్కన ఎటు చూసినా పిచ్చి మొక్కలు పెరగడంతో విద్యార్థులు అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు.
ఆరోగ్య కార్యకర్త లేక అవస్థలు
డొంకరాయి గిరిజన సంక్షేమ వసతి గృహంలో సుమారు 100 మంది వరకు విద్యార్ధినులు ఉన్నారు. వీరు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు కూడా లేవు. ఇదిలా ఉంటే ఆశ్రమ పాఠశాలలో ఉండాల్సిన ఆరోగ్య కార్యకర్త లేకపోవడంతో ఆ వసతి గృహాల విద్యార్ధినుల అవస్థలు అన్నీఇన్ని కావు. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే పరుగున ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఉంది. అర్ధరాత్రి అపరాత్రి అనక ఆడపిల్లలను బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఐటీడీఏ అధికారులు దృష్టిసారించాలి
గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో ఉండి చదువుకునే పేద విద్యార్థులకు, ఆదివాసీ విద్యార్ధినులకు కష్టాలు తప్పడం లేదు. వసతి గృహాల్లో సమస్యల కారణంగా పిల్లలు చదువుపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేని పరిస్థితి నెలకొంది. రంపచోడవరం ఐటీడీఏ అధికారులు ఇప్పటికైనా డొంకరాయి ఆశ్రమ పాఠశాల సమస్యలపై దృష్టిసారించి కనీసం మౌళిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు.