రామతీర్థంలో ఆలయ శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. నెల్లిమర్ల పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలని హైకోర్టులో అశోక్ గజపతిరాజు పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కాగా, డిసెంబర్ 22న రామతీర్థం కొండపై రామాలయ నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి హాజరయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. అశోక్ గజపతిరాజును కొబ్బరికాయ కొట్టకుండా వెల్లంపల్లి అడ్డుకున్నారు. దీంతో అశోక్ గజపతి రాజు అనుచరులు శంకుస్థాపన ఫలకాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగింది. ఈ ఘటన అనంతరం మంత్రులు వెల్లంపల్లి, బొత్స సత్యనారాయణలు ఆశోక్ గజపతి రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఈ వ్యవహారంపై టీడీపీ నేత అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. రామతీర్థం ఘటనపై ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital