అమరావతి, ఆంధ్రప్రభ : అసని తుపాన్ ప్రభావంతో రాష్రంలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నుంచి నడిచే పలు విమానాలను రద్దు చేస్తున్నట్లు వివిధ సంస్థలు ప్రకటించాయి. బుధవారం విశాఖ నుంచి నడిచే 22 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. అలాగే బెంగళూరు, ఢిల్లిd నుంచి విశాఖకు వచ్చే రెండు సర్వీసులను ఎయిర్ ఏషియా రద్దు చేసింది. అలాగే మరో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా ఫ్లైట్ సర్వీసులను క్యాన్సిల్ చేసినట్లుగా వెల్లడించింది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందని విమానయాన సంస్థలు వెల్లడించాయి.
అలాగే విజయవాడ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి కూడా అసని ప్రభావంతో పలు సర్వీసులు రద్దయ్యాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. అలాగే రాజమండ్రి, కడప నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి అన్ని సర్వీసులు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం రాత్రి విశాఖ నుంచి నడిచే కొన్ని విమానాలను పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, హైదరాబాద్ సర్వీసును పునరుద్ధరిస్తున్నట్లుగా స్పైస్ జెట్ ప్రకటించింది.