Sunday, November 17, 2024

ఏపీలో ఆర్టికల్ 360.. రాష్ట్రంలో రాజిరెడ్డి రాజ్యాంగం: టీడీపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ 360 ఉపయోగించాల్సిన పరిస్థితులు దాపురించాయని టీడీపీ పార్లమెంట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, రామ్మోహన్ నాయుడు ఆదివారం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పరిశీలించి అవసరమైతే ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దాలని సూచించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని విమర్శించారు. జగన్ ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్ లేకుండా చేస్తున్నారని తాము అనేక సార్లు చెప్పిన విషయాన్ని కాగ్ నివేదిక మరోసారి స్పష్టం చేసిందన్నారు. 48 వేల కోట్ల రూపాయలను ఎందుకు ఖర్చు పెట్టారు? నిధులన్నీ ఏమయ్యాయి? ట్రెజరీ కోడ్ ఉల్లంఘించారంటూ కాగ్ పేర్కొందని రామ్మోహన్ వివరించారు. రాష్ట్రాన్ని జగన్ సొంత కంపెనీల భావించి లూటీ చేశారని, 48 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయితే ఎలా దోచుకుంటారో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి మరోసారి స్కూల్లో చేరి ఎనిమిదో తరగతి నుంచి పుస్తకాలు చదువుకోవాలని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి నాయకత్వం లేదు. జగన్‌కు విజన్ లేదన్న ఎంపీ, పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క కంపెనీ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదని, ఎవరైనా వచ్చినా వారి నుంచి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాత్రూములు, చెత్త సహా ప్రతి దానిపై పన్నులు వేసి ప్రజలను పీక్కు తింటున్నారని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. అనంతరం కనకమేడల రవీంద్రకుమార్ మాట్లాడుతూ… పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి శాసనసభలో సవరణలు చేయలేరనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. పార్లమెంట్ చేసిన చట్టాలను కూడా కొట్టేయగల అధికారం న్యాయస్థానాలకు ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని, చట్టసభలను అపహాస్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యం చేయకూడదన్న కనకమేడల, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించే పాలించాలని సూచించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పాలించేవారు అరాచకవాదులని అభివర్ణించారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు అధికారంలో ఉన్న వారు ప్రజలకు ఇబ్బందులు కలిగిచినప్పుడు, మానవ హక్కులకు భంగం కలిగినప్పుడు కాపాడే బాధ్యత న్యాయస్థానాలకే ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా కోర్టుల మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్న చేస్తున్నారని, న్యాయస్థానాల అధికారాలు ఆపరిమితమైనవని వివరించారు. పార్లమెంట్ చేసిన చట్టాలు, చట్టాలకు చేసిన సవరణలు రాజ్యాంగ పరిధిలో లేకపోతే న్యాయస్థానాలు కొట్టివేసిన సందర్భాలు గతంలో ఉన్నాయని ఎంపీ రవీంద్రకుమార్ గుర్తు చేశారు. పార్లమెంట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి శాసనసభ సవరణలు చేయటానికి వీల్లేదనే విషయాన్ని హైకోర్టు చెప్పిందని వివరించారు. లేని అధికారాన్ని శాసనసభలో చర్చించటం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. శాసనసభలో చర్చించటం రాజ్యాంగ ఉల్లంఘన, న్యాయ స్థానాల తీర్పులను ధిక్కరించడమేనన్నారు. పార్లమెంట్‌కు మాత్రమే చట్టాలు చేసే అధికారం, సవరణలు చేసే అధికారం ఉందని, ఆ అధికారాలు ప్రకారం చేసిన చట్టమే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టమని గుర్తు చేశారు. న్యాయమూర్తులను బెదిరించడం, న్యాయవ్యవస్థను దూషించటం, శాసనసభ వేదికగా న్యాయస్థానాలపై చర్చ, న్యాయస్థానాల తీర్పులను ధిక్కరించడమేనని రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement