కోడుమూరు మాజీ ఎమ్మెల్యేకి షాక్
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు
వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట హాజరు
రిమాండ్ విధించిన న్యాయమూర్తి
కర్నూలు రాజకీయాల్లో కలకలం
ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు బ్యూరో: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ రెడ్డిని గురువారం కర్నూల్ రెండవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఒక బాలికను లైంగికంగా వేధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విషయంపై ఓ మహిళ ఫిర్యాదు చేయగా పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉదయం మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అసభ్యకరపనిచేశారంటూ ఉమ్మడి జిల్లా వాసులు మాజీ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, బాధిత బాలిక గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అందుకు ప్రైవేటుగా పంచాయతీ నిర్వహించారని ప్రచారం జరిగింది. సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ప్రస్తుతం సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఓర్వకల్ మండల పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించినట్టు సమాచారం.