తిరుమల (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): తిరుమల నడకదారిలో వన్య మృగాల బెడద నేపథ్యంలో అండర్ పాస్, ఓవర్ పాస్ లతో పాటు ఫెన్సింగ్ నిర్మించే ఆలోచన మంచిదేనని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ)కి చెందిన ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం సూచించింది. ఆ బృందం సభ్యులు ఈరోజు సాయంత్రం అలిపిరి ఫుట్‌పాత్ మార్గాన్ని పరిశీలించారు. కాలినడకన అలిపిరి నుండి నరసింహ స్వామి దేవాలయం వరకు వారి క్షేత్ర పరిశీలన కొనసాగింది.
ముఖ్యంగా ఆరు చిరుతలు పట్టుబడిన ప్రాంతాలను, చిన్నారులు కౌశిక్, లక్షితలపై జంతువుల దాడి జరిగిన రెండు ప్రదేశాలను వారు పరిశీలించారు. నడకదారి స్థితి గతులను, ఫెన్సింగ్, అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌ల వంటి శాశ్వత చర్యలకు ఉన్న అవకాశాలను కూడా అధ్యయనం చేశారు. ఇటీవలికాలంలో టి టి డి, అటవీ శాఖ తీసుకున్న స్వల్పకాలిక చర్యలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ బృందం లో డబ్ల్యుఐఐ శాస్త్రవేత్త డాక్టర్పా రమేష్ తో పాటు డాక్టర్. అశుతోష్ సింగ్, మరియు . ప్రశాంత్ మహాజన్ ఉన్నారు. ఆ బృందం వెంట ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిఎఫ్ నాగేశ్వరరావు, డిప్యూటీ సిఎఫ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.