Wednesday, November 20, 2024

అరోగ్య శ్రీ బ‌కాయిలు….సేవ‌లు నిలిపి వేస్తామంటూ హెచ్చ‌రిక‌లు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆరోగ్య శ్రీ బకాయిలు రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఆరోగ్య శ్రీ ట్రస్టు నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రుల యాజమాన్యం ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసే దిశగా కీలక నిర్ణయం తీసుకో బోతున్నట్లు తెలుస్తున్నది. అందుకు సంబంధిం చి గత రెండు రోజులుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ నేతలు ఓ తీర్మానాన్ని కూడా చేసి ఆ దిశగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే గతంలోనే బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ లోపు కొంత మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే ప్రభుత్వం బకాయిలు చెల్లించేందుకు అవసరమైన ప్రక్రియను కూడా చేపడుతుంది. అయితే ఆ సమయంలోపు బిల్లులు చెల్లించకపోతే మే 1వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసే అంశాన్ని కూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ సంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే శుక్రవారం ఇదే అంశంపై జోరుగా ప్రచారం సాగడంపై ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు అటువంటిదేమీ లేదంటూ ప్రకటన చేశారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆ దిశగా తీర్మాణాన్ని చేసి రాష్ట్ర అసోసి యేషన్‌కు పంపినట్లు సమాచారం. దీంతో నిజంగానే మే 1వ తేది నుంచి ఆరో గ్యశ్రీ సేవలు నిలిచిపోతాయన్న ఆందోళన లబ్దిదారుల్లో వ్యక్తమవుతుంది.

బిల్లులు చెల్లించకపోతే .. సేవలు నిలిపివేసే యోచన ?
రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిం చింది. ఆ దిశగా ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో 2263 ఆస్పత్రులకు అనుమతి ఇచ్చింది. పై వైద్యశాలలన్ని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఆరోగ్య శ్రీ కార్డు కలిగిన లబ్దిదారులకు సుమారు 3357 రోగాలకు సంబంధించి ఉచితంగా సేవలను అందిస్తుంది. అయితే అందుకు సంబంధించి నెట్‌వర్క్‌ వైద్యశాలలకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయినట్లు చెబుతున్నారు. గతంలోనే ఇదే అంశంపై నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఘ నేతలు బిల్లుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మార్చి నెలాఖరు లోపు కొంత మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ మేరకు చెల్లింపులు జరగకపోవడంతో వైద్యసేవలను నిలిపివేసే యోచనలో ఆస్పత్రులు ఉన్నాయి. దీంతో ఈ నెల 25లోపు బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఆ సమ యంలోపు బిల్లులు చెల్లించకపోతే సేవలను నిలిపివేసే యోచనలో వైద్యశా లలు ఉన్నట్లు తెలుస్తుంది.

మే 1 నుంచి సేవలు నిలిపివేస్తారంటూ ప్రచారం
మే 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ వైద్యసేవలను నిలిపివేయబోతు న్నారంటూ శుక్రవారం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలను పొందుతున్నారు. నిత్యం ప్రతి వైద్యశాలలో 50 నుంచి 100 వరుక ఆరోగ్య శ్రీ ఓపీలు ఉంటున్నాయంటే రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఆరోగ్య్రశీని నమ్ముకుని ఎంతమంది పేదలు ఆధారపడి ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జలుబు, జ్వరాలతో పాటు కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శ్రీ సేవలకు ఆటంకం కలిగితే పేద ప్రజలు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకా శం ఉంది.

అటువంటిదేమీ లేదంటూ ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారుల ప్రకటన
ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆరోగ్య శ్రీ ట్రస్టు అధికారులు శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు 2వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నమాట కూడా వాస్తవం కాదని, మే 1వ తేది నుంచి సేవలను నిలిపివేస్తామంటూ ఆస్పత్రి సంఘాలు నోటీసులు ఇచ్చాయన్న ప్రచారం కూడా అసత్యమేనన్నారు. ఎ టువంటి అవాంతరాలు లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు యథాతధంగా కొనసాగుతాయని, ఈ విషయంలో లబ్ధిదారులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement