న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైసీపీ ప్రభుత్వం కాకరకాయ కబుర్లు చెప్పడం తప్ప కొత్తగా కట్టిన ఒక్క ఇల్లూ లేదు, గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లను లబ్దిదారులకు ఇచ్చిందీ లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారే తప్ప ఒక్క కాలనీ కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. 5 లక్షల ఇళ్లన్నారే గానీ ఎక్కడ ఇళ్లు కట్టలేదన్న ఆయన, ఇళ్ల నిర్మాణంలో మధ్యప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్క పని పూర్తి కాలేదని, రాజశేఖర్ రెడ్డి ఏ రోజు సొంత డబ్బా కొట్టుకోలేదని రఘురామ గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఏనాడైనా ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. మంచి చేసుకుంటూ ముందుకు వెళితే మంచి పేరు అదే వస్తుందని అభిప్రయాపడ్డారు. డబ్బులు తీసుకున్నా ప్రజలు ఓట్లు వేయని రోజులు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. లక్షా 35 వేల కోట్లు మూడు సంవత్సరాలలో నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఏపీలో పెన్షనర్ల వద్ద వాలంటీర్లు వంద నుండి 150 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పెన్షనర్ల సొమ్మును నేరుగా ఖాతాలకు పెన్షన్ బదిలీ చేయడానికి ప్రభుత్వం చాలా కారణాలు వెతుకుతోందని రఘురామ విమర్శించారు. ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు డ్రా చేసి పెన్షనర్లకు పంచడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే 5 వేల రూపాయల గౌరవ వేతనం చాలక చాలా మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీలో చేతివాటం చూపిస్తున్నారని చెప్పారు. వన్ నేషన్ వన్ రేషన్ విధానం ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ ఉన్నా అర్హులైన వారికి పెన్షన్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలిపారు. అతిత్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో అప్పలరాజు, జయరాం తప్ప మహామహులకు ఉద్వాసన జరగనుందని సమాచారం అందుతోందని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. బొత్సా, పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని వంటి వారిని తప్పిస్తే పార్టీలో ముసలం పుడుతుందనే ప్రచారం జరుగుతోందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..