Saturday, November 23, 2024

ఇకనైనా ఊపందుకునేనా? జగనన్నకాలనీల్లో ఇప్పుడిప్పుడే మొదలైన సందడి

విజయనగరం, ప్రభన్యూస్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు పథకం’లో భాగంగా నిర్మాణాలు ఇప్పటికైనా ఊపందుకునేనా? అన్న ప్రశ్న సర్వత్రా తలెత్తుతోంది. ఈ పథకానికి సంబంధించి మెగా గ్రౌండింగ్‌ మేళాలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జిల్లాకు వచ్చిన వైనం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి పేర్కొన్న విధంగా..ముఖ్యంగా ప్రభుత్వం ఆశించిన విధంగా జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు సాగని పరిస్థితి అందరికీ తెలిసిందే. జిల్లాలో అతి పెద్ద హౌసింగ్‌ కాలనీలో కూడా పదుల సంఖ్యకు మించని విధంగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన వైనం ఎవ్వరికీ తెలియనిది కాదు. నవరత్నాలు అమల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద జిల్లాలో 907 లేఅవుట్లలో 1,01,368 ఇళ్లు మంజూరయ్యాయి. భూములను సేకరించి, వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడానికి ఒక్క విజయనగరం జిల్లాలోనే సుమారు రూ.277.44 కోట్లు ఖ ర్చు చేసిన వైనం అందరికీ తెలిసిందే. పేదల ఏళ్ల నాటి కలను నిజం చేసేందుకు, జిల్లాలో సుమారు రూ.1,917 కోట్ల అంచనా వ్యయంతో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. లేఅవుట్లలో 500కుపైగా ఇళ్లున్న చోట అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, విద్యుత్‌, ఇంటర్‌నెట్‌ కేబుల్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి.

జిల్లా వ్యాప్తంగా 1,01,368 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా అందులో బిలో బేస్మెంట్‌ లెవెల్‌ (బీబీఎల్‌)లో 39వేల గృహాలు, బేస్మెంట్‌ స్థాయిలో 12 వేల గృహాలు, రూఫ్‌లెవెల్‌ స్థాయిలో 4,400గృహాలు, రూఫ్‌ కాస్ట్‌ స్థాయిలో గృహాలు 4800 వరకు ఉన్నాయన్నది హౌసింగ్‌ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 4,300 గృహాలు అన్ని రకాల పనులు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాయన్నది నివేదికల సారాంశం. మొత్తం 69వేల గృహాలు గ్రౌండింగ్‌ అయ్యాయని, ఇప్పటి వరకు అన్ని లేఅవుట్లలో 88 శాతం మ్యాపింగ్‌, 78 శాతం జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పనులు పూర్తయినట్లు గృహ నిర్మాణ శాఖ చెబుతోంది.

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే సామాగ్రి : సిమ్మెంట్‌ 90 బస్తాలు, ఇసుక 20 టన్నులు, ఇనుము 347 కిలోలు..
బిల్లులు చెల్లించే విధానం : పునాదులు పూర్తి చేస్తే రూ. 60వేలు, పైకప్పు వరకు నిర్మాణం చేస్తే రూ. 60వేలు, శ్లాబ్‌ వేస్తే రూ.30వేలు, ఇంటి నిర్మాణం పూర్తయితే రూ. 30వేలు చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు లబ్ధిదారుల ఖాతాల్లో జమైంది.

పావలా వడ్డీకే సులభంగా రుణాలు..

లబ్ధిదారుల సౌకర్యార్ధం ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తోంది. దానిలో భాగంగా ఇల్లు కట్టుకొనే లబ్ధిదారులకు సులభమైన రీతిలో పావలా వడ్డీకే అదనంగా రూ. 35,000 రుణ సదుపాయం కల్పిస్తోంంది. జిల్లాలో ఇప్పటి వరకు స్వయం సహాయ సంఘాల్లో సభ్యత్వం కలిగిన లబ్ధిదారులు 10,105 మందికి ఒక్కొక్కరికి రూ.35వేల చొప్పున డీఆర్డీఏ ద్వారా రుణాలు మంజూరు చేసారు. మొత్తం 8,950 సంఘాల్లోని 10,105 మందికి కలిపి మొత్తం రూ. 35.36 కోట్లు రుణ సదుపాయం కల్పించటం గమనార్హం.

- Advertisement -

ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నాం : జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి..

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను సంబంధించి ప్రణాళికాయుతంగా ముందుకెళ్తున్నామని, తరచూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని తెలుసుకుంటున్నామని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తెలిపారు. లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నామని, ఇళ్లు కట్టుకోవడానికి ముందుకొచ్చే వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు కూడా చెల్లిస్తున్నట్లు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement