Sunday, November 24, 2024

AP | పొత్తులు అధికారం కోసమేనా.. చిలకలూరిపేట స‌భ‌పై పేర్ని నాని

ఏపీలోని చిలకలూరిపేటలో మూడు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభ వెలవెలబోయిందని వైసీపీ నాయకుడు పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్ల కిందట నరేంద్ర మోదీని ఉగ్రవాదిలాంటి వారు అన్న చంద్రబాబు ఐదేళ్లు తిరిగేసరికి విశ్వగురువులా ఎలా కనిపించారని ఎద్దేవాచేశారు. న్డీయేకు ఓటు వేస్తే ఏం చేస్తారో సభలో నేతలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తారా, లేదా అని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.

అమరావతి స్కామ్‌పై దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో మోదీ ఎందుకు చెప్పలేదని అన్నారు. రాష్ట్రం విభజన హామీల చట్టం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. వైసీపీ, కాంగ్రెస్‌ రెండు ఒకటే అని మోదీ వ్యాఖ్యనించడాన్ని ఏపీ ప్రజలు ఎవరూ నమ్మరని పేర్కొన్నారు. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని మోదీకి సూచించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2014లో కూటమిగా అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రానికి ఏం మేలు చేశారని ఆరోపించారు. పొత్తులు అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందించారని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement