Wednesday, January 8, 2025

Araku valley – సుప్రీం చీఫ్ మ‌న్యం టూర్‌!

12న అరకులోయ‌కు రానున్న సీజేఐ ఖ‌న్నా
గిరి గ్రామ‌ద‌ర్శిని ప‌రిశీలించేందుకు రాక‌
బొర్రా గుహ‌ల సంద‌ర్శించే అవ‌కాశం
మ‌న్యంలో టూర్‌లో మ‌రో 25 మంది న్యాయమూర్తులు
అనంత‌గిరి హిల్ రిసార్ట్స్‌లో అంద‌రికీ విశ్రాంతి
గిరిజ‌నుల స్థితిగతులు స్వ‌యంగా తెలుసుకునే చాన్స్‌
ఆ రోజు ప‌ర్యాట‌కులకు అనుమ‌తి లేద‌న్న అధికారులు

అర‌కులోయ‌, ఆంధ్ర‌ప్ర‌భ‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతోపాటు 25 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈనెల 12వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ ఈ విష‌యాన్ని తెలిపారు. చోడవరం 9వ అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి రత్నకుమార్, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడతో కలిసి అరకులోయ గిరిజన మ్యూజియానికి వచ్చిన పీవో.. న్యాయ‌మూర్తుల ప‌ర్య‌ట‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

- Advertisement -

గిరి గ్రామ‌ద‌ర్శిని ప‌రిశీల‌న‌..

న్యాయమూర్తులు గిరిజన మ్యూజియంతోపాటు గిరి గ్రామదర్శినిని పరిశీలిస్తారని, అనంతగిరి హరిత హిల్‌ రిసార్ట్స్‌లో విశ్రాంతి తీసుకొన్న అనంతరం బొర్రాగుహలను సందర్శించి విశాఖపట్నం వెళ్తారని ఐటీడీఏ పీవో తెలిపారు. స్థానిక గిరిజనుల స్థితిగతులను, ఇక్కడి పరిస్థితులను న్యాయమూర్తులు నేరుగా తెలుసుకొనే అవకాశముందని, ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. న్యాయమూర్తుల పర్యటన నేపథ్యంలో ఈనెల 12న గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శినిల్లోకి పర్యాటకులకు అనుమతి ఉండదని పీవో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement