Friday, November 22, 2024

అయ్యో.. ఆక్వా ! విద్యుత్‌ కోతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆక్వా రంగం

ఒంగోలు, ప్రభన్యూస్‌ : డాలర్ల పంట ఆక్వా రంగానికి విద్యుత్‌ కోతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తుండటంతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరతతో రొయ్య పిల్లలు నీటి పై తేలాడుతున్నాయి. ఆక్వా సాగులో అగ్రస్థానంలో ఉన్న జిల్లాలో వందలాది మంది కార్మికులు పని చేస్తుంటారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్‌ కొరతతో ప్రభుత్వం పవర్‌ హాలిడే ప్రకటించడంతో ఆక్వా రంగం పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 24 గంటలూ కరెంటు వినియోగించే రొయ్యల హేచరీలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమలు 50 శాతం విద్యుత్‌ మాత్రమే వినియోగించాలని ఆంక్షలు విధించడంతో..ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే రొయ్యలు మృత్యువాత పడి లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అప్పులు చేసి రొయ్యల సాగు చేస్తున్న రైతులకు విద్యుత్‌ కోతలతో పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రకాశం,బాపట్ల జిల్లాల పరిధిలో 12 మండలాల్లో ఆక్వా సాగవుతోంది. జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో ఉన్న 10 మండలాలతో పాటు, మంచినీటి ఆధారంగా మరో రెండు మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. సముద్ర తీర ప్రాంతాలైన నాగులుప్పలపాడు, ఒంగోలు, టంగుటూరు, కొత్తపట్నం, జరుగుమల్లి, సింగరాయకొండ మండలాలతో పాటు, బాపట్ల జిల్లాలో కలిసిన చీరాల, వేటపాలెం, చినగంజాం, నెల్లూరు జిల్లాలో కలిసిన ఉలవపాడు మండలాలతో పాటు, మంచినీటి చెరువుల ద్వారా దర్శి, అద్దంకి మండలాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. సుమారుగా 7వేల హెక్టార్లకు పైగా ఆక్వా సాగు చేస్తున్నారు. జిల్లాలో రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ( హెచరీలు) 44 వరకు ఉన్నాయి. వీటితో పాటు రొయ్యలను ప్రాసెసింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 10 ప్రాసెసింగ్‌ ప్లాంట్లు ఉన్నాయి. అంతే కాదు సింగరాయకొండలో ఆక్వా ఫీడ్‌ ప్లాంటుతో పాటు, 65 ఆక్వాషాపులు, 23 ఐసీసీ ప్లాంట్లు, 3 ప్యాకింగ్‌ యూనిట్లు, 10 ఆక్వా ల్యాబ్స్‌ ఉన్నాయి. ఇవన్నీ విద్యుత్‌పైనే ఆధారపడి ఉంటాయి. హెచరీ లు, ప్రాసెసింగ్‌ యూనిట్లు 50శాతం విద్యుత్‌ మాత్రమే వినియోగించాలని ఆంక్షలు విధించడంతో పాటు, వారంలో ఒక రోజు పవర్‌ హాలిడే ప్రకటించడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్‌ ఆధారంగా నడిచే హేచరీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లలో కరెంటు సరఫరా నిలిపివేస్తే రొయ్య పిల్లలు చనిపోయి..రూ.కోట్లలో నష్టం వస్తుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు వారంలో ఐదు రోజుల పాటు, రోజుకు 12 గంటలు మాత్రమే పని చేయాల్సి రావడంతో ఆ ప్రభావం రొయ్యల మార్కెట్‌ పై పండింది. ప్రభుత్వం ప్రకటించిన పవర్‌ హాలిడే ఆంక్షలతో రొయ్యల ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే పని చేస్తున్నాయి. పవర్‌ హాలిడేతో రాత్రిపూట రెండో షిప్టుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అం తే కాదు పని గంటలు సగానికి పైగా తగ్గిపోయింది.

ఐస్‌ దొరక్క అవస్థలు !

విద్యుత్‌ కోతలతో ఐస్‌ ప్యాక్టరీల కు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. 100 కిలోలు ఉండే ఐస్‌ క్యాన్‌ ధర గతంలో రూ.180 వరకు ఉండేది. విద్యుత్తు కోతలతో ప్రస్తుతం ఆ ధర రూ.250కు పెరిగింది. అంతే కాదు నాణ్యమైన ఐస్‌ దొరక్కపోవడంతో చేపలు, రొయ్యలు పట్టుబ డులు నిలిచిపోతున్నాయి. గతంలో పెద్ద ఎత్తున సరుకు వివిధ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేది. పట్టుబడులు లేకపోవడంతో ఎగుమగులు 20శాతం మేర తగ్గాయని, పరిస్థితి ఆలాగే ఉంటే రానున్నా రోజుల్లో 50శాతానికి పరిమితం కాక తప్పదని ఎగుమతి దారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement