Friday, November 22, 2024

తెలంగాణ కంటే రెండు పైసలే అదనం.. ఆర్టీసీ ప్రయాణికులు ఆలోచించాలి

అమరావతి, ఆంధ్రప్రభ: పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ఆర్టీసీ చార్జీలు స్వల్పంగానే పెంచామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కేఎస్‌ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. తెలంగాణతో పోల్చితే పల్లె వెలుగు సర్వీసులు సహా అన్ని సర్వీసుల్లో రెండు పైసలు మాత్రమే అదనమని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ పల్లెవెలుగులో కిలో మీటరుకు రూ.1.04 పైసలు కాగా ఏపీలో రూ.1.02 పైసలు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో తెలంగాణలో రూ.1.26 కాగా ఏపీలో రూ.1.25 పైసలు, సూపర్‌ లగ్జరీలో తెలంగాణలో రూ.1.64 పైసలు ఉంటే ఏపీలో రూ.1.62 పైసలు ఉందన్నారు. ఇంద్ర సర్వీసుల్లో తెలంగాణలో రూ.1.99 పైసలు ఉంటే ఏపీలో రూ.1.99 పైసలు మాత్రమేనని ఆయన స్పష్ట ంచేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలోనే ఆర్టీసీ చార్జీలు తక్కువగా ఉన్న విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. డీజిల్‌ ధరలు పెరగడంతో విధిలేని స్థితిలోనే టిక్కెట్ల రేట్లను స్వల్పంగా పెంచామన్నారు.

సామాన్య ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఏపీఎస్‌ ఆర్టీసీ ఆచితూచి వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా బస్సుల నిర్వహణ భారమైనప్పటికీ ప్రజలపై భారం మోపకుండా సర్వీసులు నడిపామని బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. డీజిల్‌ ధరలతో పోల్చితే ప్రయాణికులపై సెస్‌ విధింపు అత్యంత స్వల్పమన్నారు. గత ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ విధింపు ద్వారా రోజుకు రూ.రెండు కోట్లు రాబడి వస్తుందని అంచనా వేస్తే రూ.1.50 కోట్లకు మించలేదన్నారు. 2019 మేలో రూ.66.56గా ఉన్న డీజిల్‌ రేటు ఈ నెల 1వ తేదీ నాటికి రూ.99.06కు పెరిగిందని, ఇదే బల్కు రేటు లీటర్‌ రూ.134.79గా ఉందన్నారు. 2015 ధరలతో పోల్చితే డీజిల్‌ రేటు వందశాతం పెరిగిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ టిక్కెట్టు రేట్లను స్వల్పంగా పెంచక తప్పలేదనే విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని బ్రహ్మానంద రెడ్డి కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement