Friday, November 8, 2024

APSRTC | శబరిమలకు ప్రత్యేక బ‌స్సులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో యాత్రికులు శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేప‌థ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చింది. శబరిమల వెళ్లే వారి కోసం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఎపీఎస్ఆర్టీసీ టెక్కలి నుంచి శబరిమలకు ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను ఏర్పాటు చేయ‌గా.. 5, 7, 11 రోజుల టూర్ ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టింది.

ప్యాకేజీల వివ‌రాలు !

  • ఐదు రోజుల ప్యాకేజీ – టెక్కలి నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సు విజయవాడ, ఎరుమేలి, పంబ మీదుగా యాత్ర సన్నిధానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, అన్నవరం, సింహాచలం మీదుగా టెక్కలి చేరుకుంటుంది.
  • ఏడు రోజుల ప్యాకేజీ – విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, ఎరుమేలి, పంబ మీదుగా సన్నిధానానికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో మదురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం మీదుగా టెక్కలి చేరుకుంటుంది.
  • 11 రోజుల ప్యాకేజీ – టెక్కలి నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సు.. శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవానీ, పళని, గురువాయూర్, ఎరుమేలి, పంబ మీదుగా శబరిమల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీ కాళహస్తి, విజయవాడ, అన్నవరం, సింహాచలం ఆలయాలను సందర్శించవచ్చు.

ఈ ప్యాకేజీలను ఎంచుకునే వారు అయ్యప్ప దర్శనంతో పాటు పైన పేర్కొన్న ఆలయాలను కూడా సందర్శించవచ్చు. అయితే ఎంపిక చేసిన బస్సు సర్వీసు, టూర్ ప్యాకేజీ ప్రకారమే ధరలు ఉంటాయని డిపో అధికారులు తెలిపారు. శబరిమలకు వెళ్లాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement