Wednesday, November 20, 2024

ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు…

ఏపీ ప్రజలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రతి రోజు 15 వేలకుపైగానే కేసులు నమోదు అవుతున్నాయి. అతే సమయంలో కరోనా మరణాలు అధికం అవుతున్నాయి. కరోనా రోగుల సంఖ్య అధికం అవుతుండడంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్ల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ముందుకు వచ్చింది. కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు అనుగుణంగా కొన్ని బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేస్తోంది. ఆక్సిజన్ బెడ్లతో వెన్నెల, స్లీపర్, ఏసీ బస్సుల్లో తగిన విధంగా మార్పులు చేయాలని నిర్ణయించింది. బెడ్ల కొరత ఉన్న ప్రాంతాల్లో కరోనా రోగులకు బస్సుల్లోనే వైద్యం చేసేందుకు ఈ నిర్ణయం వీలు కల్పించనుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రులు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బస్సులు సేవలు అందించనున్నాయి.  

ఈ ప్రత్యేక బస్సును విజయవాడలో ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. బస్సులో తాము చేసిన ఏర్పాట్లను, ఇతర సౌకర్యాలను ఆర్టీసీ ఎండీ మంత్రికి వివరించారు.
ఈ ఆర్టీసీ బస్సు ద్వారా 10 మంది కరోనా రోగులకు చికిత్స అందించే వీలుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ బస్సులను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బుట్టాయిగూడెం, కేఆర్ పురం ప్రజారోగ్య కేంద్రాల వద్ద ఈ ఆక్సిజన్ బెడ్లతో కూడిన బస్సుల ద్వారా సేవలు అందిస్తామన్నారు. ప్రస్తుతానికి 10 ఆర్టీసీ స్లీపర్ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని, మున్ముందు మరిన్ని ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్ని నాని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement