అమరావతి : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సులో ఒకేసారి రెండువైపులా టికెట్ బుక్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది.
సంక్రాంతి పండుగ దృష్ట్యా 7,200 అదనపు బస్సులను తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు నడపాలని సంస్థ నిర్ణయించిందని ఆర్టీసీ ఎండీ మంగళవారం వెల్లడించారు. ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153, బెంగళూరు నుంచి పలు చోట్లకు 375 బస్సులు, విజయవాడ నుంచి 300 బస్సులను నడుపనున్నామని వివరించారు. తిరుగు ప్రయాణాలకు ఈనెల 16 నుంచి 20 వరకు 3200 ప్రత్యేక బస్సులు అన్ని ప్రాంతాలకు నడుపుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ తెలిపారు.