ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ-ఎప్ సెట్) లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. ఏప్రిల్ 11న ఎప్ సెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించామని, మే పదో తరగతి వరకు ఆలస్య రుసుము లేకుండా స్వీకరించినట్టు తెలిపారు. జూన్27 నుంచి హాల్ టికెట్ల ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఎప్ సెట్‌లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు ఈ నెల 11, 12 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గం టల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు, సెషన్‌కు 22 వేల మందికి చొప్పున పరీక్షలు జరుగుతాయని శ్యామలరావు వివరించారు. ఎప్ సెట్‌కు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట నుంచి గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. కె. హేమ చంద్రారెడ్డి సూచించారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్ టికెట్‌తోపాటు ఐడీ ప్రూఫ్, ఫేస్ మాస్క్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు.
విద్యార్థులు బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్ మినహా స్మార్ట్ వాచ్‌లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరీక్షా కేంద్రంలోకి తెచ్చుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎప్ సెట్ కోసం ఆర్టీసీ, మెడికల్, పోలీస్, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఏవైనా సందేహాలుంటే అభ్యర్థులు హెల్ప్ డెస్క్ 08554- 234311, 08554- 232248 నంబర్లలో కానీ, ఏపీఈఏపీసెట్2022 హెల్ప్‌డెస్క్ ఎట్‌దరేట్‌ఆఫ్‌జీమెయిల్.కామ్ కు ఈ మెయిల్ ద్వారా కానీ సంప్రదించవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.