Tuesday, November 26, 2024

రేషన్​ పంపిణీకి పోషకాలున్న బియ్యం.. సేకరణకు కొత్త విధానం..

దేశ వ్యాప్తంగా పేదలకు చౌక దుకాణాల ద్వారా బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఇక నుంచి పోషక విలువలు వుండే బలవర్ధకమైన బియ్యం పంపిణీ చేయాలని మొగ్గు చూపుతోంది. ప్రతినెలా తెల్లకార్డు లబ్ధిదారులకు రేషన్‌ ద్వారా అందజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో భారత ఆహారసం (ఎఫ్‌ సీఐ) ద్వారా బలవర్ధ (పోర్టిఫైడ్‌) బియ్యాన్ని సేకరించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి సార్టెక్స్‌ బియ్యాన్ని తీసుకుంటోంది. ఇందులో నూక 15శాతం మాత్రం ఉండేలా నిబంధన విధించింది. పాడైన బియ్యం ఉండకూడదు. రాళ్లు, తదితరాలకు తావులేదు. ఇటువంటి బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నాన్‌ సార్టెక్స్‌ బియ్యం తీసుకుంటుంది అందులో 25శాతం మేర నూక ఉండొచ్చు. పాడైన, రాళ్లు, రప్పలు మరో 3శాతం వరకు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటువంటి నిబంధనలతో ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం బియ్యం సేకరిస్తూ వస్తోంది. ఇక పైనా నాన్‌ సార్టెక్స్‌ బియ్యం తీసుకుంటుంది. అయితే వాటిని బలవర్ధకంగా మార్పుచేసి ఇవ్వాలి. అందుకోసం క్వింటాల్‌ బియ్యానికి కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.80 వెచ్చిస్తోంది. పోషక విలువతో కూడిన గింజలను నాన్‌ సార్టెక్స్‌ బియ్యంలో మిళితం చేస్తారు. వాటిని ఎఫ్‌సీఐకి అప్పగిస్తారు. రైస్‌ మిల్లుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగిస్తారు. ప్రధానంగా ఉభయగోదా వరి జిల్లాల్లో కొన్ని మిల్లుల్లోనే ఇటువంటి సౌకర్యం ఉంది. అక్కడ బియ్యాన్ని పోషక విలువలతో కూడిన గింజలను మళితం చేస్తారు.

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు, గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం బలవర్ధక బియ్యాన్ని అందజేస్తోంది. తెల్లకార్డు లబ్ధిదారులకు మాత్రం సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కూడా బలవర్ధక బియ్యాన్ని రేషన్‌ లబ్ధిదారులకు అందజేయనున్నట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్ర స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారు. సెంట్రల్‌ పూల్‌ కింద బల వర్ధక బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకారం తెలిపింది. వాస్తవానికి ఇప్పటిదాకా సుమారు 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మిల్లర్లకు అప్పగించారు. కస్లమ్‌ మిల్లింగ్‌ ద్వారా మిల్లర్ల నుంచి తిరిగి దాదాపు10 లక్షల టన్నులు బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంది. అందులో పౌర సరఫరాల కార్పొరేషన్‌ సుమారు 10 లక్షల టన్నుల బియ్యాన్ని భద్ర పరుస్తుంది. రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుంది. మిగిలిన 1.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించనుంది. రబీలోనూ ఇదే మాదిరిగా ఎఫ్‌సీఐ బలవర్ధకమైన బియ్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement