విజయవాడ: జూన్ 3 నుంచి మెయిన్స్ పరీక్షలను 10 జిల్లాల్లోని 11 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కేవలం 15 నిమిషాలు మాత్రమే గ్రేస్ పిరియడ్ ఉంటుందని.. ఆ సమయం దాటితే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. జులైలో మెయిన్స్ ఫలితాలు వెల్లడించి ఆగస్టు చివరి నాటికి గ్రూప్-1 ఇంటర్వ్యూలు పూర్తిచేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
కాగా, త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను జూన్ 3 నుంచి 10 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సవాంగ్ తెలిపారు.ఈ ఏడాది జనవరి 8న ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించామని సవాంగ్ చెప్పారు. పరీక్షలు జరిగిన 19 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని.. 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారన్నారు.