Saturday, November 23, 2024

కులగణన వల్లే బీసీలకు సముచిత న్యాయం.. వైసీపీ ఎంపీల విజ్ఞప్తికి ప్రధాని సానుకూలం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : త్వరితగతిన బీసీ వర్గాల డిమాండ్‌ను అమలు చేయాలని తాము చేసిన విజ్ఞప్తిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు వెల్లడించారు. బుధవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు ప్రధానిని ఆయన కార్యాలయంలో కలిశారు. బీసీ జనగణన జరపాలని నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో పెండింగులో ఉన్న అతి ప్రధాన సమస్య ఓబీసీ రిజర్వేషన్ గురించి ప్రధానితో మాట్లాడామని తెలిపారు. ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బీసీలను రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తున్నట్టే జాతీయ స్థాయిలో కూడా తీసుకువెళ్లాలని ప్రధానిని కోరామన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా దేశంలో బీసీ కులగణనపై స్పష్టత లేదని, బీసీ వర్గాలకు సముచిత న్యాయం కులగణన వల్లే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

తమ ప్రతిపాదనపై ప్రధాని సానుకూలంగా స్పందించారని మోపిదేవి సంతోషం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు పరిమితం చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవులిచ్చి సముచిత ప్రాతినిథ్యం కల్పించారని ఆయన చెప్పారు. పలు సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు న్యాయం చేస్తున్నారని అన్నారు. మహిళలకు కూడా ప్రత్యేక పథకాల ద్వారా పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ… కులగణన జరపకుండా రిజర్వేషన్లలో రాజ్యాంగ సవరణ చేస్తే కోర్టులు తప్పు పట్టే అవకాశం ఉందని, బీసీ జనాభాకు తగినంత రిజర్వేషన్ కల్పించాలని ప్రధానిని కోరామని వెల్లడించారు.

కులజనగణన లెక్కలు లేకుండా రిజర్వేషన్లలో మార్పులు చేయలేమని, న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు అమలు జరపాలని విజ్ఞప్తి చేశామన్నారు. న్యాయ వ్యవస్థలో జడ్జి పదవుల్లో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు సరైన ప్రాతినిథ్యం దక్కడం లేదని సుభాష్ చంద్రబోస్ చెప్పుకొచ్చారు. జనాభా లెక్కల ప్రకారం బీసీ జనగణన చేయాలని అభిప్రాయపడ్డారు. దేశంలో 53 శాతం మంది బీసీలు ఉన్నప్పటికీ బీసీలను రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నా, చట్టసభల్లో తగిన ప్రాతినిథ్యం లేదని వాపోయారు. ఓబీసీల అభివృద్ధికి, ప్లానింగ్ కోసం ఖచ్చితమైన బీసీ జనాభా లెక్కలు అవసరమని నొక్కి చెప్పారు. పార్లమెంట్, శాసనసభ, న్యాయవ్యవస్థలో బీసీలకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement