Thursday, October 24, 2024

AP | హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం

ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్‌, చల్లా గుణరంజన్‌లను అదనపు జడ్జిలుగా నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.

వీరి నియామకం కోసం ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలతో చర్చించిన తర్వాత వీరిని ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ఎక్స్‌లో వెల్లడించారు.

అలాగే, కర్ణాటక హైకోర్టులో అదనపు జడ్జిగా ఉన్న జస్టిస్‌ సిద్ధయ్య రాచయ్యను అదే హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. వీరిలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నరేందర్‌ పేరును ఉత్తరాఖండ్‌ హైకోర్టు సీజేగా ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement