Saturday, November 23, 2024

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు.. భ‌క్తుల నుంచి బంగారం, వెండి కానుకలు

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఈ మేరకు గురువారం సింహాద్రినాధుడి హుండీలను తెరిచి లెక్కించారు. ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆద్వర్యంలో ఈ హుండీ లెక్కింపు కొనసాగింది. 33 రోజులకు రూ.1.06 కోట్లు ఆదాయం లభించింది. దీంతో పాటు బంగారం, వెండి, విదేశీయ డాలర్లు పెద్ద మొత్తంలో భక్తులు సమర్పించారు. ఇటీవల కాలంలో సింహాద్రినాధుడి ఆలయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో ఆదాయం కూడా అదే మొత్తంలో పెరుగుతూ వస్తుంది.

13న అప్పన్నకు ఆఖరి విడత చందన సమర్పణ..

ఈనెల 13న ఆషాడ పౌర్ణమి సందర్భంగా సిరిలొలికించే సింహాద్రినాధుడికి ఆఖరివిడతగా మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. వైశాఖ శుద్ధ తదియనాడు అప్పన్న చందనోత్సవం (నిజరూపదర్శనం)రోజు రాత్రికి తొలివిడతగా మూడు మణుగుల చందనం సమర్పించారు. తదుపరి వైశాఖ, జ్యేష్ట, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగులు చొప్పున ఏడాదిలో నాలుగు విడతల కింద 12 మణుగులు చందనం సమర్పించడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆఖరి విడత చందన సమర్పణకు అవసరమైన పచ్చి చందనాన్ని బుధవారం నుంచి సిబ్బంది అరగదీసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement