విశాఖపట్నం-ఆంధ్రప్రభ బ్యూరో: దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరాహాలక్ష్మీనృసింహస్వామికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించింది. ఈ మేరకు ఆలయ ఇవో సింగాల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో సోమవారం ఆలయ అధికారులు, సిబ్బంది 24 హుండీలు తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు.
సుమారు 33 రోజులకు సంబందించి నగదు రూపంలో రూ.2,42,40,632 లభించింది. వీటితో పాటు బంగారం, వెండి కానుకలతో పాటు పెద్ద ఎత్తున విదేశీయ డాలర్లు స్వామికి సమర్పించారు. ఇటీవల కాలంలో సింహగిరికి భక్తులు తాకిడి అధికంగా పెరిగింది. తద్వారా పలు విభాగాల నుంచి పెద్ద మొత్తంలో దేవస్థానానికి ఆదాయం లభిస్తుంది. సరాసరి రోజుకు రూ.7,34,565 లభిస్తున్నట్లు ఆలయ ఇవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.