Thursday, November 21, 2024

అప్పలరాజు వర్సెస్‌ నారా లోకేష్‌..  ఏపీ శాసన మండలిలో హోరాహోరీ!

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ శాసన మండలిలో మంత్రి అప్పలరాజు వర్సెస్​ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్​ అన్నట్టుగా సాగింది. ఇవ్వాల జరిగిన చర్చలో చేనేత కార్మికుల అంశం బర్నింగ్​ టాపిక్​గా మారింది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మంత్రి అప్పలరాజు వెల్లడించారు. గురువారం శాసనమండలిలో టీడీపీ సభ్యులు నారా లోకేష్‌, వైకాపా ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత, బీజేపీ సభ్యుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఏడు పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా ప్రతి ఏటా రూ. 24 వేలు నేతన్న అకౌంట్‌లో జమ చేస్తున్నామని తె లిపారు. గడిచిన మూడేళ్లుగా ఈ పథకానికి రూ. 576.86 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. చేనేత మగ్గాల రిపేర్లకు, ఇతర ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండేలా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న నేతన్నలకు ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని చెప్పారు. 2019-20లో 81 వేల 783 మందికి, 2020-21లో 78 వేల 211 మందికి, 2021-22లో 80 వేల 031 మందికి లబ్ధి చేకూరిందని మంత్రి అప్పలరాజు వెల్లడించారు. అలాగే 50 సంవత్సరాలు పైబడిన నేతన్నలకు వృద్ధాప్య ఫించన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,01,646 మందికి ఫించన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

ఆత్మహత్యలకు పాల్పడ్డ చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో రూ. 1.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను చెల్లించేవారని, అయితే ఇప్పుడు ఆ పరిహారం మొత్తాన్ని రూ. 7లక్షలకు పెంచాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన 25 మంది చేనేత కార్మికులకు ఈ పరిహారాన్ని అందిస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్రం జీఎస్టీని పెంచుతుందని ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవద్దని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సూచించారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి పెంచాలని కేంద్రం ప్రతిపాదించిందని దీనిని ఉపసంహరించుకోవాలని ఆర్థికమంత్రికి ఇప్పటికే ఒక లేఖ రాశారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని లేని పక్షంలో హ్యాండ్‌లూమ్‌, పవర్‌లూమ్‌ తరహాలో జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హ్యాండ్‌లూమ్‌ పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించారు. జీఎస్టీ పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని భరోసానిచ్చారు.

మంత్రి వర్సెస్‌ లోకేష్‌..
చేనేత కార్మికుల సంక్షేమంపై జరిగిన చర్చలో మంత్రి అప్పలరాజు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చేనేత కార్మికులకు ఇస్తున్న సబ్సీడీకి కేవలం కేటాయింపులు చేస్తున్నారే కానీ చెల్లింపులు ఎక్కడని లోకేష్‌ నిలదీశారు. మంత్రి రూ. 11 కోట్లు కేటాయించినట్లు చెప్తున్నారని, వాటిని ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు గతంలో మీరు మంత్రిగా పనిచేశారని అలాగే మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సబ్సీడీలు, పరిహారాలు చెల్లించాలని ఎందుకు గుర్తురాలేదని నిలదీశారు. ఇదే విషయాన్ని మంత్రి పలుమార్లు ప్రస్తావిస్తూ వచ్చారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను రాజశేఖర రెడ్డి చెల్లించారని, విభజన తర్వాత బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి వ్యాఖ్యానించారు. యాన్‌ సబ్సీడీ చెల్లింపుల అంశాన్ని తేల్చాలని లోకేష్‌ పట్టుబట్టారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటికెళ్లి మీన్నాన్నని అడుగు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై లోకేష్‌తో పాటు టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని తానేమి విశాఖపట్నం సీఐని కాదని, చొక్కా విప్పదీయడానికంటూ లోకేష్‌ విరుచుకుపడ్డారు. సభ ఎవరి జాగిరి కాదన్న విషయాన్ని తెలుసుకోవాలని ధ్వజమెత్తారు. గౌరవం లేకుండా మాట్లాడిన మంత్రి క్షమాపణ చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో ఛైర్మన్‌ సభను వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement