మాకవరపాలెం, (విశాఖపట్నం) ప్రభన్యూస్: నర్సీపట్నాన్ని అనకాపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని ప్రయత్నించిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణష్‌కు జిల్లా కేంద్రానికి బదులుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , ఆ హామీని నిలబెట్టుకున్నారని వైసిపి వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో మెయిన్ రోడ్డును అనుకొని ఉన్న డి పట్టా భూములు మెడికల్ కాలేజీ నిర్మాణానికి అనువైన ప్రాంతంగా అధికారులు గుర్తించారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూములిచ్చేందుకు రైతులు కూడా అంగీకరించారు. డి.పట్టా భూములు ఎకరాకు రూ. 19.50లక్షల చొప్పున నష్టపరిహారంతోపాటు, భూముల్లో ఉన్న చెట్లు, ఇతర కట్టడాలకు కూడా నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమచేసింది. 52.15 ఎకరాల డి.పట్టా భూములకు 11కోట్ల 66లక్షల 12వేల 750రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు అందజేసింది.
సోమవారం రైతులకు నష్టపరిహారం అందజేయగా మంగళవారం రెవెన్యూ అధికారులు భూములను లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్,ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎంఎస్‌ఐడిపి)కు అధికారులకు అప్పగించారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారప్ ఎంవివి,ప్రసాద్ మెడికల్ కాలేజీ నిర్మాణానికి సేకరించిన భూములను లాంఛనంగా ఎపిఎంఎస్‌ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.అచ్చంనాయుడు, ఆంధ్రా మడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిరాజులకు అప్పగించారు. అనంతరం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టనున్న భూములను పరిశీలించారు. ఈసందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బుచ్చిరాజు మాట్లాడుతూ 2024 నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.కాలేజీ నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం 500కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన తెలిపారు. ఈభూముల్లో చెట్లు, ఇతర నీటివనరులను కాలేజీ నిర్మాణంలో మరింత ఆకర్ణణీయంగా,ఆహ్లాదకరంగా ఉండేవిధంగా చేయనున్నట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్. జి.బుచ్చిరాజు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, రెవెన్యూ సిబ్బంది, .ఎంపిపి,రుత్తల సత్యనారాయణ, మండల పార్టీ అద్యక్షుడు రుత్తల శ్రీనివాస్,వైసిపి సీనియర్ నాయకులు పెట్ల భద్రాచలంతోపాటు ఇతర వైసిపి నాయకులు పాల్గొన్నారు.