అమరావతి, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే అత్యధికంగా బైరటీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ది సంస్థ (ఏపీఎండీసీ) తాజాగా బైరటీస్ ఖనిజ విక్రయాలకు నిర్వహించిన ఇ-ఆక్షన్‌లో రికార్డు స్థాయి రేట్లను నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు చేసిన బైరటీస్ విక్రయాలతో పోలిస్తే ఏకంగా 50 శాతం అధిక రేట్లకు ఖనిజాన్ని కొనుగోలు చేసేందుకు పలువురు బిడ్డర్లు పోటీ పడ్డారు. పూర్తి పారదర్శక విధానాలు, నాణ్యమైన బైరటీస్ ఉత్పత్తి, నిరంతరం సరఫరాతో అంతర్జాతీయ మార్కెట్లో తనదైన గుర్తింపును సాధించిన ఏపీఎండీసీ చరిత్రలోనే తొలిసారిగా అత్యధిక రేట్లను సాధించింది. పెరిగిన రేట్ల వల్ల ఈ ఏడాది అదనంగా ప్రభుత్వానికి రూ.260 కోట్ల ఆదాయం సమకూరనుంది.
రూ. 6,691 ధర పలికిన ఏ గ్రేడ్..
బైరటీస్ ఉత్పత్తిలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఏపీఎండీసీ తాజాగా ఏ,బీ,సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజాల విక్రయం కోసం ఇ-ఆక్షన్ నిర్వహించింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎ గ్రేడ్ ఖనిజం, 3 లక్షల మెట్రిక్ టన్నుల బి గ్రేడ్, 20 లక్షల మెట్రిక్ టన్నుల సి, డి గ్రేడ్ ఖనిజానికి నిర్వహించిన టెండర్లలో కొనుగోలుదారులు పోటీపడ్డారు. ఈ మేరకు ఎ గ్రేడ్ బైరటీస్‌ను మెట్రిక్ టన్ను అత్యధికంగా రూ.6,691కి కోట్ చేశారు. గతంలో ఎ గ్రేడ్ టన్ను రూ.4,625 కాగా, తాజాగా రూ.2,066 అధికంగా రేటు పలికింది. అలాగే టన్ను బి గ్రేడ్ రూ.5,225 పలికింది. గతంలో ఇదే బి గ్రేడ్ మెట్రిక్ టన్ను రూ.3,350 కాగా తాజాగా రూ.1,875 అధికంగా ధర పెరిగింది. అలాగే సి,డి గ్రేడ్ ఖనిజ ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదయ్యింది. వరుసగా మూడేళ్ళ పాటు ఈ ధరలు అమలులో ఉంటాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధరల పెరుగుదలను ప్రతి ఏటా ఏపీఎండీసీ సమీక్షించుకుని రేట్లను మరింత పెంచుకునేందుకు అవకాశం ఉంది.
నాణ్యతా ప్రమాణాలతో సంస్థకు గుర్తింపు..
ప్రపంచంలోనే అత్యధికంగా బైరటీస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏపీఎండీసీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, నాణ్యమైన ఖనిజాభివృద్ధితో ముందుడుగు వేస్తోందని ఏపీఎండీసీ వీసీఅండ్ ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారులను కలిగివున్న సంస్థ, తాను అనుసరిస్తున్న ఉన్నతమైన ప్రమాణాల వల్లే నేడు ఇ-ఆక్షన్‌లో మంగంపేట బైరటీస్‌కు రికార్డు స్థాయిలో రేటు లభించిందని తెలిపారు. పటిష్టమైన మార్కెటింగ్ నెట్ వర్క్‌తో, సమర్థవంతమైన మైనింగ్ ఆపరేషపరేషన్స్తోఏపీఎండీసీ ప్రగతిపథంలో పయనిస్తోందని చెప్పారు. అలాగే అంతర్జాతీయంగా ఇటీ వల భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా దానికి అనుబంధంగా వున్న బైరటీస్ మార్కెట్‌ను ప్రభావితం చేసిందన్నారు. ఇదే స్పూర్తితో ఏపీఎండీసీ మంగంపేట బైరటీస్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ సాధించి, ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని ఆర్జించేందుకు కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఏడాది రాయలసీమలో భారీ వర్షాలు కురవడం వల్ల మంగంపేట బైరటీస్ ప్రాజెక్ట్‌లో ఉత్పత్తికి ఆటంకాలు ఏర్పడినప్పడికీ, ప్రతికూలతను సవాల్‌గా తీసుకుని రికార్డు స్థాయిలో 2.7 మిలియన్ టన్నుల బైరటీస్‌ను వెలికితీయడం జరిగిందన్నారు. ఆటంకాలు లేకుండా నిరంతరం అనుకున్న మేరకు బైరటీస్‌ను అందించడం వల్ల అంతర్జాతీయ వినియోగదారుల దృష్టిలో సంస్థ ప్రతిష్ట ఇనుమడించిందనిచెప్పారు. అలాగే ప్రస్తుతం మంగంపేట ప్రాజెక్ట్‌లో ఉన్న 74 లక్షల మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ గ్రేడ్ నిల్వలను కూడా విక్రయించేందుకు అంతర్జాతీయ కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే దీనిపై ఎంఓయులు కుదుర్చుకుంటామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..