Monday, November 18, 2024

చేనేత వస్త్రాలు ధరించండి – నేత కార్మికుల‌ను కాపాడండిః ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి

మంగళగిరి రూరల్ మే 20 ప్రభ న్యూస్… అప్కోలో పేరుకుపోయిన చేనేత వస్త్ర నిల్వలను క్లియర్‌ చేసి నేత కళాకారులకు నిరంతర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తెలిపారు. అందులో భాగంగా ఆప్కో వస్త్ర దుకాణాల్లో చేనేత వస్త్రాలను భారీ డిస్కోంట్‌తో విక్రయిస్తున్నట్టు ప్రకటించారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం ఆప్కో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ చేనేతల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆప్కో ద్వారా చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆప్కోలో దాదాపు రూ.పది కోట్ల విలువ చేసే వస్త్ర నిల్వలు వున్నాయన్నారు. వాటన్నింటినీ త్వరితగతిన విక్రయించేందుకు గాను ఎంపిక చేసిన వస్త్రాలపై 33 శాతం, 50 శాతం, 66 శాతం రిబేటు ఇస్తున్నట్టు చెప్పారు.

దీంతో కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ప్రైవేటు దుకాణాలకు ధీటుగా ఆప్కో షోరూములను అభివృద్ధి పరిచేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూముల్లో ఈ డిస్కౌంట్‌ సేల్‌ అందుబాటులో వుంటుందన్నారు. బయటి మార్కెట్‌లో స్వచ్ఛమైన చేనేత వస్త్రాలు దొరికే పరిస్థితి లేదని, కేవలం ఆప్కో షోరూముల్లో మాత్రమే చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలు లభిస్తాయని చెప్పారు. ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి, గద్వాల, ధర్మవరం, మదనపల్లె, మాధవరం, బందరు, చీరాల తదితర చేనేత కేంద్రాల్లో తయారైన చీరలు, ధోవతులు, డ్రెస్‌ మెటీరియల్స్‌, దుప్పట్లు, టవళ్లు, లుంగీలు, పంచెలు, ఖర్చీఫ్‌లు ప్రత్యేక డిస్కౌంట్‌తో విక్రయించడం జరుగుతుందన్నారు. స్టాకు వున్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్‌ సేల్‌ అందుబాటులో వుంటుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దేశంలో వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత పరిశ్రమను పరిరక్షించుకోవలసిన బాధ్యత సమాజంలో అందరిపైనా వుందన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి నేత కార్మికులను ఆదరించాలని చైర్మన్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్కో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement