అమరావతిలోని రాజ్‌భవన్‌లో నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడంతోపాటు రాష్ట్రంలోని ఇతర కార్యాలయాలకు నోటీసులు ఇచ్చి తమ నేతలపై కేసులు పెట్టడంపై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఏపీ వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఫోటో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. వైసీపీకి ఓటు వేసిన వారిపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. తమ పార్టీ కార్యాలయాల్లోకి అక్రమంగా చొరబడి భవనాలను కూల్చివేస్తారేమోనని భయపడుతున్నారని అన్నారు.
దీనిపై గతంలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే వైసీపీ కార్యాలయాలకు స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణ పనులు చేపట్టామన్నారు.