అమరావతి, ఆంధ్రప్రభ: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ శనివారం మరోసారి బెంగళూరు బయల్దేరి వెళ్ళారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చింది మొదలు ఆయన బెంగళూరుకు వెళ్ళడం ఇది పదోసారి. పార్టీలో జరుగుతున్న పరిణామాలను కూడా ఆయన అక్కడి నుంచే సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడలో బుడమేరు వరదల సందర్భంలో, ఏలేరు వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన బెంగళూరు నుంచే వచ్చారు. తాజాగా శుక్రవారం తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై తాడేపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించి, అసలేం జరిగిందో సుదీర్ఘంగా వివరించారు.
వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో టెండర్ల వల్లనే ఇదంతా జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చి, అనంతరం బెంగళూరు బయల్దేరి వెళ్లారు.
బెంగళూరు నుంచి ఆంధ్రా వచ్చినప్పుడల్లా రెండుమూడు జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. వివిధ హోదాల్లో ఉన్న నేతలు పార్టీని వీడటంతో ప్రత్యామ్నాయ నేతల నియామకాలు చేపడుతున్నారు.