Sunday, June 30, 2024

AP – పెద్దిరెడ్డి కోటకు గండి … పుంగనూరులో వైసీపీ ఖాళీ – పసుపు చొక్కాల్లో చైర్మన్ తో 17 మంది కౌన్సిలర్లు

( ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుపతి (రాయలసీమ బ్యూరో ) : గత ప్రభుత్వ హయాంలో ఎదురు లేని మంత్రి గా పేరొందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కోట బీటలు వారుతోంది. రెండేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకున్న పుంగనూరు మున్సిపాలిటీ తెలుగుదేశం పరం కానున్నది. ఈరోజు ఇప్పటి వరకు పదవులే తప్ప అధికారం లేకపోవడం తో 17 మంది కౌన్సిలర్ల తో తెలుగుదేశం పార్టీ లో చేరనున్నట్టు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ ప్రకటించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నడుమ దశాబ్దాల నాటి రాజకీయ వైషమ్యాలు గత అయిదేళ్ల మధ్య కాలంలో పరాకాష్ట కు చేరింది. కుప్పం లో వరుసగా ఏడుసార్లు గెలుస్తూ వచ్చిన చంద్రబాబు ను ఈసారి ఓడించడానికి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సర్వ శక్తులను వినియోగించారు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయం చెందడంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. పొత్తులో భాగంగా ఒక చోట పోటీ చేసిన జనసేన అభ్యర్థి గెలవగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి మాత్రం గెలిచారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో అధికారం లో వచ్చిన కూటమి ప్రభుత్వ బలంతో తెలుగుదేశం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వర్గ బలాన్ని తగ్గించే కృషి మొదలు పెట్టింది. రెండేళ్ల క్రితం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి హయాంలో ఏకపక్షంగా జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలిచిన స్థానిక సంస్థల పై దృష్టి సారించింది. గతంలో ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు కూడా వేయడానికి వీలులేని వాతావరణంలో వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న మున్సిపాలిటీలు, మండలాలలో ఆకర్ష్ పధకం అమలు మొదలైంది. ఈ క్రమంలోనే పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ చల్లా బాబు నేతృత్వం లో తెలుగుదేశం పార్టీ లో చేరనున్నట్టు పుంగనూరు మునిసిపల్ చైర్మన్ హలీం బాషా ఈరోజు ప్రకటించారు.

తనతో పాటు 11 మంది కౌన్సిలర్లు కూడా చేరుతారని చెప్పారు. ఈ సందర్బంగానే వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు పదవులు వచ్చినా అధికారాలు మాత్రం తమ చేతుల్లో లేనందున ప్రజలకు ఏమీ చేయలేక పోయామని, అందుకే తెలుగుదేశం పార్టీ లో త్వరలో చేరనున్నట్టు ప్రకటించారు. దీంతో 20 వార్డులున్న పుంగనూరు మున్సిపాలిటీని వైసీపీ కోల్పోవడం ఖాయమవుతోంది.


ఒక విధంగా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కేంద్ర స్థానం ఆనదగిన పుంగనూరు మున్సిపాలిటీ త్వరలో తెలుగుదేశం పార్టీ పరం కావడం లాంఛనమే అని స్పష్టం అవుతోంది. అసలే ఓటమి భారంతో కునారిల్లుతున్న వైసీపీ కి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్మించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కోటలు బీటలు వారడం ఆయన ఇలాకాలోనే మొదలైందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement