కర్నూలు, ప్రభ న్యూస్ బ్యూరో : కర్నూలు జిల్లాలో భారతీయ జనతాపార్టీలో మనస్తాపంతో తాను బీజేపీకి రాజీనామా చేశానని, అయితే బీజేపీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం సంప్రదించి తనకు తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారని నగరూరు రాఘవేంద్ర తెలిపారు. గురువారం కర్నూలులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ… ఏపీ బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకుల సంప్రదింపులతో తిరిగి బీజేపీలో కొనసాగనున్నట్లు తెలిపారు.
పార్టీ నేతల సూచన మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో దాఖలు చేసిన నామినేషన్ను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. గత పదేళ్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయే కూటమిని ఏర్పాటు ఏర్పడింది అని తెలిపారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కనిగిరి నీలకంఠ, కోశాధికారి లోకేశ్వరయ్య పాల్గొన్నారు.