అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక..చక సాగుతున్నాయి. 2024 -25 నుండి మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రారంభమయ్యే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతుల నిర్వహణకు విధివిధానాలను డీఎంఈ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించేందుకు అనుమతించాలంటూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి రూ. 84 లక్షల దరఖాస్తు రుసుము చెల్లించారు.
కొత్తగా ఏర్పాటు కానున్న వైద్య కళాశాలల్లో సరిపడా ఫ్యాకల్టీ మరియు సిబ్బంది నియామకానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బోధన సిబ్బంది నియామకాల్ని కాంట్రాక్టు, రెగ్యులర్ విధానంలో ఎలా చేపట్టాలన్న విషయంలో ప్రతిపాదనల్ని సిద్ధం చేస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం, అలాగే రెగ్యులర్ విధానంలో ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకున్న గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం సిఎంసి వెల్లూరు లో అనుసరిస్తున్న విధానంపై కూడా వైద్యశాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
3,530 పోస్టుల మంజూరు
ఈ ఐదు ప్రాంతాల్లో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్ని బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేయడంతో పాటు వైద్య కళాశాలలకు 222, బోధనాసుపత్రికి 484 చొప్పున 3,530 పోస్టుల్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు వచ్చింది. వసతుల కల్పనపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఒక్కో మెడికల్ కళాశాల్లో 150 సీట్లు చొప్పున 750 సీట్లు కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేశారు. వీటితో పాటు అనంతపురం వైద్య కళాశాల్లో 50, నెల్లూరు, శ్రీకాకుళం కళాశాల ల్లో 25 చొప్పున మొత్తంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు దరఖాస్తు చేశారు.
ప్రస్తుతం అనంతపురంలో 150, శ్రీకాకుళంలో 175 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్కో కళాశాల్లో 200 సీట్లకు కావాల్సినంత వసతులు బోధనాసుపత్రుల్లో ఉన్నాయి. ఈక్రమంలో సీట్లు పెంపుదల చేయాలంటూ అదనంగా వంద సీట్లు పెంపుదల చేయాలంటూ ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. కొత్త మెడికల్ కళాశాలలతో పాటు అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు కళాశాలలకు ఎన్ఎంసీ బృందం త్వరలో తనిఖీలు చేపట్టనుంది.
అందుబాటులోకి 850 ఎంబీబీఎస్ సీట్లు
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్యరంగాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టిసారించారు. మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు చేరువ చేయడంతో పాటు వైద్య విద్య అవకాశాలను పెంపుదల చేయడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా 17 కొత్త వైద్యకళాశాలల్ని రూ.8,500 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. తొలి విడతగా ఈ ఏడాది విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి మెడికల్ కళాశాలు ఈ ఏడాది ప్రారంభం అయ్యాయి.
ఒక్కో కాలేజీకి 150 సీట్ల చొప్పున 750 సీట్లు అదనంగా మనకు వచ్చాయి. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్ మదనపల్లెల్లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాలల్లో మరో 750 సీట్లతో పాటు అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు ప్రాంతాల్లోని కళాశాల్లో మరో వంద సీట్లు చొప్పున మొత్తంగా 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
వైద్య విద్యలో దూసుకెళుతున్న ఏపీ
రాష్ట్రంలో మొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాల 1923వ సంవత్సరంలో విశాఖ పట్టణంలో ఏర్పాటు కాగా నాటి నుంచి ఈ వందేళ్ల కాలంలో కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే గత ప్రభుత్వాలు ఏర్పాటు-చేయగలిగాయి. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద మొత్తంలో నిధుల్ని ఖర్చు చేస్తున్నారు. ఈక్రమంలో ఎదురవుతున్న అడ్డంకుల్ని చాకచక్యంగా అధిగమిస్తున్నారు. దేశానికి స్వాతంత్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటు- మునుపెన్నడూ జరగలేదు. వైద్య విద్యలో దూసుకెళుతున్న ఆంద్రప్రదేశ్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది.