ప్రతి వ్యక్తికి మరింత మెరుగైన సేవలు
ఈ యుగంలో సమాచారమే పెద్ద నిధి
స్మార్ ఫోన్ ఉంటే చాలు.. ఎక్కడున్నా విధులు నిర్వహించవచ్చు
ఫెర్టిలిటీ రేటు పెరగాల్సిందే
అలా కాకుంటే ఇబ్బంది పడేది మనమే
ప్రమాదాన్ని ముందే గుర్తించి మేల్కొవాలి
యువత ఎంత ఉంటే అంత సంపద ఉన్నట్టే
లీడర్ షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూ ఢిల్లీ : ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోనే ఇది తొలిసారిగా అమలు చేస్తున్నాం అన్నారు. తద్వారా ప్రజా సేవలను చివరి వ్యక్తి వరకు అందించాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో శనివారం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు విషయాలను షేర్ చేసుకున్నారు. లీడర్‌షిప్ సదస్సులో ప్రసంగిస్తూ.. ఈ యుగంలో సమాచారమే ఓ పెద్ద నిధి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
టెలీకామ్ రంగంలో డీరెగ్యులేషన్ వల్ల పురోగతి ఉంటుందని రిపోర్ట్ ఇచ్చామని, దాన్ని అమలు చేయడంతో టెలీకాం రంగం వృద్ధి చెందిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్నాలజీని ఉపయోగించి అన్ని రంగాల్లో పరిష్కారాలు వెతకొచ్చని తెలిపారు. ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మన పనులు చేసుకుంటూ పోవచ్చని చంద్రబాబు వెల్లడించారు. సోషల్ మీడియాలో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిపై జాతీయ స్థాయిలోనే చట్టం తీసుకురావల్సిన అంశాన్ని ప్రస్తావించారు.
జననాల రేటు పెరగాల్సిందే..
దక్షిణాది జనాభా అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. గతంలో తాను బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌంట్ ఎయిడ్స్ అనే నినాదాన్ని ఇచ్చానని గుర్తు చేస్తూ.. ఇప్పుడు బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్ అని పిలుపునిస్తున్నాని అన్నారు. ఇప్పుడు చైనా, జపాన్ సహా అనేక ప్రపంచ దేశాల్లో వయోధికులు ఎక్కువైపోయారన్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమస్య ప్రారంభమైందని వివరించారు. ఫెర్టిలిటీ రేటు ఇక్కడ తగ్గిపోతోందని.. సాధారణంగా ఇది 2.1 కంటే ఎక్కువగా ఉంటే సమస్య ఉండదన్నారు. ప్రస్తుతం బోర్డర్ లైన్‌లో జననాల రేటు ఉందన్నారు. ఇది కాస్త తగ్గితే జపాన్, చైనా మాదిరి సమస్య మొదలవుతుందన్నారు.
కొత్త రూల్ తేవాలి.. ఇద్దరు పిల్లలుంటేనే..
దేశంలో 145 కోట్ల జనాభా ఉందని చంద్రబాబు అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరని ధీమావ్యక్తం చేశారు. మనం సరిగా ప్లాన్ చేస్తే 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేస్తారని, దేశానికి ఆదాయం తీసుకొస్తారని అన్నారు. బ్రిటీష్ వాళ్లు ఎలాగైతే భారత్‌కు వచ్చి పరిపాలించారో, మనం కూడా అలాగే ప్రపంచదేశాలకు వెళ్లి ఆ దేశాలను ఏలవచ్చని తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిబంధనలు పెట్టానని.. ఇప్పుడు ఆ నిబంధన తొలగించానన్నారు. కనీసం ఇద్దరు పిల్లలుంటే తప్ప పోటీకి అర్హత లేదని ఇప్పుడు నిబంధన పెట్టాలి.. అంటూ నవ్వుతూ చెప్పారు.