( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ) – అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం ఇవ్వటమే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా మారాలని, ఆర్థిక అసమానతలు తగ్గించటమే ధ్యేయమన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంటును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. పెద్దఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమానికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి దాదాపు 25 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీ4 విధానంలో) పేదరిక నిర్మూలన చేయాలని సూచించారు.
ప్రతి ఇంటిలో ఓ పారిశ్రామికవేత్త రావాలి
నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచీ ఓ ఐటీ ఉద్యోగి తయారయ్యాడని, విజన్ 2047లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త తయారు కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే రెండో సూత్రమని తెలిపారు. ఇందులో భాగంగా పరిశ్రమలు ఏర్పాటును ప్రోత్సహిస్తూ నాణ్యత కలిగిన ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలో తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జనాభా హెచ్చు తగ్గులను సమన్వయం చేయటాన్ని ఉద్యమంగా చేపట్టాలని సూచించారు. నైపుణ శిక్షణ ఇప్పించి, మానవవనరుల అభివృద్ధి చేయటం మూడో సూత్రంలో ప్రధానమని తెలిపారు. తాగడానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తూ, నీటిభద్రతకు ప్రాధాన్యమివ్వాలనే నాలుగో సూత్రంతో కరవు రహిత ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. రైతుకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి సాంకేతికత పెంచి, గౌరవంగా జీవించేలా చేసేందుకు వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానిస్తూ ఆరో సూత్రంగా విజన్లో చేర్చామని చంద్రబాబు వివరించారు.
ఏపీ దశ దిశను మార్చుతుంది
స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాందిపలికారని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించిన దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పని చేస్తుంటే తెలుస్తోందని అన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే, అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
ప్రపంచంలోనే తెలుగుజాతి నెంబర్ వన్
తెలుగుజాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. నేడు 3 వేల డాలర్లకంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి 42 వేల డాలర్లకు పెరగాలన్నది లక్ష్యమని తెలిపారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది ప్రజలు తమ ఆలోచనలు పంచుకున్నారన్నారు. సంస్కరణలు ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
విద్యార్థులతో ముఖాముఖి
స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారంటూ విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాలో ఇబ్బందులు పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని డ్వాక్రా మహిళ సుహాసిని అన్నారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రత్యేక వీడియో విడుదల చేశారు.