ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : తీరప్రాంత ప్రజలు సహా సముద్రంపై ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. తీరప్రాంత పర్యావరణ, రక్షణ అంశంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతాలలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేసి పోర్టులను కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో తీరప్రాంత అభివృద్దికి,పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో తీరప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు. మత్స్యకారులతో పాటు వ్యవసాయంపై ఆధార పడిన ప్రజల జీవనోపాధికి ముప్పు కలుగుతోందన్నారు. సముద్రంపై ఆధారపడిన వారికి తీరప్రాంత వాసులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు.