దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ కు ఊతం..
సింగిల్ విండో విధానంలో అనుమతులు…
నిబంధనలు సరళతరం…
పరిగణలోకి రియల్ ఎస్టేట్ ప్రతినిధుల అభిప్రాయాలు…
అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు..
మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ…
ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ, గడిచిన ఐదు సంవత్సరాలుగా కుదేలై ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి నూతన జవసత్వాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చామన్న ఆయన నిబంధనలను మరింత సరళతరం చేశామని తెలిపారు. విజయవాడలో శుక్రవారం క్రెడి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని, దానిని అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ ఇప్పటికే జీవోలు జారీ చేసినట్లు తెలిపారు. 10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించినట్లు చెప్పరు. లే అవుట్ లలో రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించామని, 15 మీటర్ల లోపు భవనాలు నిర్మాణాలకు ఎలాంటి అనుమతి లేకుండా లైసెన్సెడ్ సర్వేయర్ కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వివరించారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, భవన నిర్మాణాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ప్రాపర్టీ షో లో నిర్వహణ ద్వారా కొనుగోలుదారులకు అవగాహన వస్తుందని, ప్రతి ఏటా రెండు సార్లు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ల ప్రతినిధులతో సమావేశం అవుతామని వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ కేసునేని శివనాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్ ప్రాపర్టీ షో ప్రతినిధులు పాల్గొన్నారు.