Thursday, November 21, 2024

AP: మాకు ఆందోళనగా ఉంది.. అండగా ఉండండి.. పోలీసులకు అక్కడ ప్రజల విజ్ఞప్తి

సాలూరు రూరల్, ప్రభ న్యూస్: కొఠియా గ్రూపు గ్రామాలకు ఒడిశా పోలీసులు నిత్యం రాత్రివేళ వచ్చి గ్రామాల్లో కలియతిరుగుతున్నారని, అందువల్ల తమకు ఆందోళనగా ఉందని పై గ్రూపు గ్రామాలకు చెందిన పగులుచెన్నూరు, పట్టుచెన్నూరు ప్రజలు ఆరోపించారు. సోమవారం పైగ్రామాల్లో ఆంద్రాకు చెందిన కొఠియా సిఐ రోహిణీ పతి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను సమస్యలపై ప్రశ్నించారు.

పింఛన్ రాని వాళ్ళు, ఇన్నాళ్లు పింఛన్ వచ్చి నేడు ఆగినవారు, గ్రామాల్లో కాలువలు, వీధి దీపాలు కావాలని కొందరు అడగ్గా సిఐ వారినుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం పైగ్రామాలకు చెందిన ప్రజలు భయాందోళనలను వారి నాయకుడు చోడిపిల్లి బిసు ద్వారా వివరించారు. తమ గ్రామాల్లో నిత్యం 50-60 మంది ఒడిశా పోలీసులు అర్ధరాత్రి వచ్చి గస్తీ తిరుగుతున్నారని, గిరిజన యువకులకు మాయమాటలు చెప్పి వారి వైపు తిప్పుకొనే ప్రమాదం ఉందని కావున ఆంధ్రా పోలీసులు ఇక్కడకు తరచూ రావాలని విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా ఐటిడిఎ పిఓ తమకు స్పష్టమైన హామీని ఇచ్చారని గుర్తు చేసారు.

కావున మీరు తరచూ వస్తే మాకు రక్షణగా ఉంటుందన్నారు. ఒడిశా పోలీసులు కొఠియా గ్రామం వద్ద ఉన్న ఠాణాలో ఉంటారని, వారికి మా గ్రామాలు దగ్గరగా ఉన్నందున ప్రతిరోజూ వస్తున్నారన్నారు. దీనికి స్పందించిన సిఐ వారితో మాట్లాడేందుకే తాము వచ్చామని, వారు వచ్చినట్లు చెబితే కేవలం ఒక గంట లోపున వస్తామని, ఎటువంటి భయం, ఆందోళన వద్దన్నారు. అదేవిధంగా మీరు చెప్పిన సమస్యలను మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. తదుపరి గిరిజన చిన్నారులతో మాట్లాడుతూ వారు అంగన్వాడీ కేంద్రాలకు వెళుతున్నది, లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లను పంచిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement