Tuesday, November 26, 2024

AP – శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీటికి కటకట….

369 గ్రామాల్లో దాహంతో తహతహ
తక్షణమే రూ 22 కోట్లు అవసరం
ఇప్పటికే 105 గ్రామంలో ప్రత్యేక బోర్లు
అత్యవసర తాగునీటి సమస్య పరిష్కారానికి అనుమతి
వచ్చే మే నెల వరకు దాహార్తి కి ప్రత్యేక చర్యలు
ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ ఈ రషీద్ ఖాన్

శ్రీ సత్య సాయి బ్యూరో ఫిబ్రవరి 19 (ప్రభన్యూస్):వేసవి ప్రారంభం కాకనే శ్రీ సత్యసాయి జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్ర స్థాయికి చేరుకుంది. . జిల్లాలోని దాదాపు 400 గ్రామాలలో తాగునీటి ఎద్దడి నెలకొంది. వాస్తవానికి గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలలోనే కదిరి, మడకశిర, ధర్మవరం, హిందూపురం నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాలలో ప్రజలు తాగునీటి సమస్యపై రోడ్డెక్కిన సంగతి అందరికీ విధితమే. కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలం ఓరువాయి, మార్పురి వాళ్ల పల్లి వంటి కొన్ని పంచాయతీల పరిధిలో సచివాలయాలలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఖాళీ బిందెలతో కార్యాలయంలోనే బైఠాయించడం, నిరసన తెలపడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

తాజాగా ధర్మవరం మండలం బిల్వంపల్లి గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకంగా నీటి కోసం ఒక మనిషిని కేటాయించుకునే పరిస్థితి వచ్చింది. ఇక హిందూపురం, మడకశిర నియోజకవర్గం లలో తాగునీటి సమస్య మరింత జటిలమైంది. మడకశిర నియోజకవర్గంలో శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకం పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని, దీంతో తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉందని జనం గగ్గోలు పెడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రభుత్వం శ్రీరామ్ రెడ్డి తాగునీటి పథకానికి కొన్ని కోట్ల నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టింది. పూర్తిస్థాయిలో పథకం వినియోగంలోకి రాలేదు. ఇంతలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. తాగునీటి పథకం పూర్తిగా అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా వృధాగా మారాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. .

నీటి ఎద్దడి నిజమే …రూ.22 కోట్లతో ప్రతిపాదన చేశాం – ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ ఈ

జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి ఇప్పటికే అధికమైంది. జిల్లా వ్యాప్తంగా 369 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి పరిస్థితి నెలకొంది. జిల్లా ప్రజల దాహార్తి తీర్చుటకు 22 కోట్ల కు ప్రతిపాదనలు పంపించాం. ఆర్ డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ ఈ రషీద్ ఖాన్ తెలిపారు.నిధులు మంజూరుపై ప్రభుత్వం నుంచి హామీ వచ్చింది. ఈలోగా తాగునీటి ఎద్దడి పై అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సైతం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. . ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 105 గ్రామాలలో ప్రత్యేకంగా బోర్లు వేసి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా తాగునీటి ఎద్దడి సమస్య ఎదురైతే తమ దృష్టికి వస్తే, తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, దాహార్తి తీర్చడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటాం, ఆర్డబ్ల్యూఎస్ ఇన్చార్జి ఎస్ ఈ రషీద్ ఖాన్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement