ఆంధ్రప్రభ స్మార్ట్, లావేరు : లావేరు మండలం లక్ష్మీపురం, పట్టవానిపేట మధ్యలో వంతెన నిర్మించాలని 15 గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. పెద్ద గెడ్డ పొంగినట్లయితే ఈ గ్రామాలకు రహదారుల నుంచి రాకపోకలు ఆగిపోతాయి. లక్ష్మీపురం గ్రామం జలదిగ్బంధం అవుతుంది. ప్రజలు బయటకి వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. గతంలో తామాడ నేతేరు మధ్య, పట్టణానిపేట లక్ష్మీపురం మధ్య, చిత్రిక పేట రౌతుపేట మధ్య కాజ్వే నిర్మించారు.
అలాగే బుడుమూరు కలిశెట్టి గూడెం దగ్గర కాజ్ వే తీసి పూర్తిస్థాయిలో వంతెన నిర్మించారు. అయితే పై మూడు ప్రాంతాల్లో వంతెనలు లేకపోవడంతో పెద్దగెడ్డ పొంగితే రౌతుపేట, రాయనింగారిపేట, తామాడ, దేశ పాలెం, నేతేరు, పట్టవానిపేట, సురాపురం, లక్ష్మీపురం, కొత్తూరుపేట, నేదురుపేట తదితర గ్రామాలకు రహదారులు మూసుకుపోతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పెద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాజ్ వే నిర్మించిన దగ్గర వంతెనలు నిర్మించినట్లయితే ఇక్కట్లు తొలుగుతాయని ఆ గ్రామస్తులు మొరపెట్టు కొంటున్నారు.