Monday, November 25, 2024

AP – కాలుష్య ఉద్యమం.. విటిపిఎస్ లో ఉద్రిక్తం

(ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్) ఎన్టీఆర్ జిల్లా ఎన్టీటీపీఎస్ కాలుష్య ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. గత నెల రోజులకు పైగా కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి పేరుతో పోరాటం నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా పోరాట సమితి సభ్యుడు భద్రను ఏపీ జెన్ కో సిబ్బంది గురువారం మాట్లాడాలని పిలిపించి విద్యుత్ సౌధాకు బలవంతంగా తీసుకెళ్లి నిర్బంధించారు. అక్కడ ఎస్పీఎఫ్ ఎస్పీ బెదిరించి వదిలిపెట్టారు. ఈ ఘటన పోరాట సమితికి ఆగ్రహం తెప్పించింది. దీనికి నిరసనగా శుక్రవారం స్థానిక రింగ్ సెంటర్ నుంచి ఎన్టీటీపీఎస్ మెయిన్ గేటు వరకు వివిధ పాఠశాలల విద్యార్థులతో నిరసన ర్యాలీ చేపట్టారు.

కాలుష్య నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలపై చీఫ్ ఇంజనీర్ కు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్టీటీపీఎస్ భద్రతా సిబ్బందిని కోరగా వారు నిరాకరించారు. దీంతో కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి ఉద్యమకారులు ఒక్కసారిగా ప్లాంట్ గేటు వద్ద కు దూసుకెళ్లారు. గేటు లోపలికి వెళ్లే ప్రయత్నంలో భద్రతా సిబ్బంది తోసివేసి అడ్డుకున్నారు. అనంతరం గేట్లు మూసివేశారు. దీంతో కాలుష్య నియంత్రణ ఉద్యమకారులు అక్కల గాంధీ చొక్కా తీసివేసి అర్ధనగ్నంగా, ఎం.మహేష్, కలకోటి బసవయ్య తదితరులు గేట్లు ఎక్కి ఎన్టీటీపీఎస్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఉద్యమకారులు గేటు ముందు బైఠాయించి ఎన్టీటీపీఎస్ యాజమాన్యం డౌన్ డౌన్, కాలుష్యం వల్ల పోతున్న ప్రాణాలను కాపాడాలని, పోరాట సమితి సభ్యుడు భద్రను అక్రమంగా నిర్బంధించి బెదిరించిన జెన్ కో డీఎస్పీ, ఎస్పీలను తక్షణమే సస్పెండ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమకారుల నినాదాలతో ఎన్టీటీపీఎస్ పరిసరాలు దద్దరిల్లాయి. దాదాపు రెండు గంటలకు పైగా ఎన్టీటీపీఎస్ మెయిన్ గేటు ముందు ఉద్యమకారులు బైఠాయించి యాజమాన్యంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం, మరోవైపు ఎస్పీఎఫ్ బలగాలు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

ఎట్టకేలకు సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇన్ చార్జి సీఈ జవహర్, ఎస్ఈ సురేష్ బాబు గేటు వద్దకు చేరుకుని ఉద్యమకారులను చర్చించేందుకు పిలిచారు. అయితే ఉద్యమకారులు అందరినీ లోపలికి అనుమతించాలని కోరగా వారు గేటు బయటకు వచ్చి చర్చలు జరిపారు. ఎన్టీటీపీఎస్ కాలుష్యం వల్ల 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఆందోళనలు చేసినా సమస్యను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు.

కాలుష్య నియంత్రణకు యాజమాన్యం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే అణిచివేయాలని, ఉద్యమకారులను బెదిరించి భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోరాట సమితి సభ్యుడు భద్రను అక్రమంగా నిర్బంధించిన డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేసే వరకు కదిలేది లేదని హెచ్చరించారు. ఉద్యమకారుల డిమాండ్ లు విన్న ఎస్ఈలు ఫోన్ లో చీఫ్ ఇంజనీర్ కు వివరించారు. నూతన చీఫ్ ఇంజనీర్ నాగరాజు విద్యుత్ సౌధాలో సమావేశానికి హాజరవడంతో చర్చలను శనివారానికి వాయిదా వేశారు. దీంతో ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు.

కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ ప్రజా పోరాట సమితి సభ్యులు అక్కల గాంధీ, నూతులపాటి బాల కోటేశ్వరరావు, చిగురుపాటి లక్ష్మి, ఎం.మహేష్, చెరుకుమల్లి సురేష్, చెరుకూరి వేణుగోపాల్, బొలియశెట్టి శ్రీకాంత్, పోలిశెట్టి తేజ, గొల్లపూడి ప్రసాద్, బసవయ్య, కరీముల్లా, వి.ఆర్.నాగిరెడ్డి, నల్లమోతు ప్రసన్న బోస్, ఎం.ఎ.హైదర్, రాజేంద్ర, నరసింహారెడ్డి, భద్ర, ఎర్రంశెట్టి నాని, సుబ్రహ్మణ్యం, మాధురి, భవానీ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement