రేపు చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం కానున్న సర్వీస్ లు
అమరావతి – ఏపీలో తొలిసారిగా సీ ప్లేన్ సర్వీస్ లు ప్రారంభం కానున్నాయి.. విజయవాడ నుంచి శ్రీశైలంకు ఈ సర్వీస్ లు నడవనున్నాయి.. డీ హవిల్లాండ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్ను సర్వీస్ లు సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో లాంచనంగా ప్రారంభించనున్నారు.. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం జలాశయానికి సీప్లేన్ విమానం ట్రైల్ రన్ నిర్వహించారు. విమానం సక్సెస్ ఫుల్ గా ల్యాండైంది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
శ్రీశైలంలో భారీ భద్రత
సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ చుట్టే భారీ పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. శ్రీశైలం అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పట్టాయి. శ్రీశైలం రిజర్వాయర్ లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు బలగాలు హై స్పీడ్ ఇంజన్ బోట్లతో రెస్క్యూ టీమ్ అప్రమత్తమైంది. సీఎం శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భారీ పోలీసు బలగాలు తనిఖీలు నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ .. బాంబు స్వ్కాడ్ బృందాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా , సీఎం కార్యక్రమాల కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు జెసి విష్ణు చరణ్, ఏఎసెల్ బృంద అధికారులు పర్యవేక్షించారు.