Sunday, November 24, 2024

AP – గ్రోత్ హబ్‌గా విశాఖ‌!ప్రణాళికలు రెడీ చేస్తున్న‌ అధికారులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌:వికసిత్‌ భారత్ 2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకొని ‘నీతి ఆయోగ్‌ ఆర్థిక ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకు ప్రాథమిక కసరత్తు పూర్తి అయ్యింది. దేశంలో మొత్తం 20 నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకు చోటు ద‌క్కింది.

ముంబయి, సూరత్, వారణాసి సిటీస్‌తో పాటు ఇప్పుడు విశాఖ కూడా విక‌సిత్ భార‌త్‌లో చోటు ద‌క్కించుకుంది. కాగా, ఆ న‌గ‌రాల అభివద్ధికి ప్రణాళికల ముసాయిదాలు ఇప్పటికే సిద్ధం కాగా విశాఖపట్నం నగరానిది తయారవుతోంది.

ఏ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి ప‌థంలో నడిపించొచ్చు, అందుకు ఉన్న అవకాశాలు ఏంట‌నే విష‌యాల‌ను అధికారులు పరిశీలిస్తున్నారు.11 రకాల అభివృద్ధి సూచికలు ఆయా ప్రాంతాల్లోని వనరుల ఆధారంగా ఆర్థిక ప్రణాళికకు ఇప్పటికే 11 రకాల అభివృద్ధి సూచికలను గుర్తించారు. వాటి ఆధారంగా కసరత్తు చేసి ఆర్థిక ప్రగతికి బాటలు వేయనున్నారు.

ఇందుకోసం విశాఖపట్నంలో నీతి ఆయోగ్ రెండు దఫాలుగా జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులు, అనుబంధ రంగాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించింది. ఏయే అంశాలపై దృష్టి సారించాలి, ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో అధికారులకు మార్గనిర్దేశం చేసింది.

- Advertisement -

విశాఖపట్నం హబ్‌ పరిధిలోకి వచ్చే జిల్లాలు

విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ. జిల్లాలు విశాఖ హ‌బ్ ప‌రిధిలోకా రానున్నాయి. ఇక‌.. ఢిల్లీ, ముంబయి నగరాల స్థూల జాతీయోత్పత్తి కొన్ని దేశాల జీడీపీ కన్నా ఎక్కువగా ఉంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల జీడీపీని ఆ స్థాయికి తీసుకువచ్చేలా ఆర్థిక ప్రణాళికలను నీతి ఆయోగ్‌ చేస్తుంది.

ముంబయిలో క‌స‌ర‌త్తు..

ముంబయి మెట్రో రీజియన్‌ గ్రోత్ హబ్‌కు ఆర్థిక ప్రణాళిక పూర్తి అయింది. ఇటీవల నీతి ఆయోగ్‌ దాన్ని ఆవిష్కరించింది. త్వరలోనే అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అమవుతున్నారు. వార‌ణాసి అభివృద్ధికి సంబంధించి ఆర్థిక ప్రణాళిక పూర్తి అయింది. చివరిగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఈ నివేదిక‌ ఉంది. ఆ తర్వాత దీన్ని అమలు చేయ‌నున్నారు.

ఇక‌.. సూరత్ కోసం ఆర్థిక ప్రణాళిక ముసాయిదా పూర్తి అయింది. దీన్ని ఈమ‌ధ్య‌నే ఆవిష్కరించారు. విశాఖపట్నం అభివృద్ధికి..విశాఖ నగరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ప్రాథమిక పరిశీలన పూర్తి అయింది. మరోసారి సమీక్షించి, నివేదిక రూపకల్పన చేయనుంది. కాగా, అభివృద్ధిలో భాగంగా దృష్టి సారించే రంగాల‌ను అధికారులు జాబితా చేశారు. ఇందులో పెట్రో రసాయన, రసాయన విభాగం, విద్య, ఫార్మా, ఐటీ , టెక్స్‌టైల్‌, పర్యాటకం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, మత్స్య సంబంధ పరిశ్రమలు, ఇంజినీరింగ్‌ గూడ్స్‌, లాజిస్టిక్స్, పోర్టు సంబంధిత కార్యకలాపాలు, రియల్‌ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం వంటివి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement