Friday, October 18, 2024

AP | అత్తాకోడళ్లపై అఘాయిత్యం… విచార‌ణ‌కు ప్రత్యేక కోర్టు !

రాష్ట్రంలో మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని ఆదేశించారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామన్నారు.

దీంతో పాటు గతంలో బాపట్ల జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య ఘటనపైనా ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు, మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళ స్వేచ్ఛగా తిరిగేలా రాష్ట్రంలో శాంతి భద్రతలు కల్పించేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement