Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP – మెట్రో రైలుకు గ్రీన్ సిగ్న‌ల్‌! స్పీడందుకోనున్న నిర్మాణ‌ ప‌నులు

AP – మెట్రో రైలుకు గ్రీన్ సిగ్న‌ల్‌! స్పీడందుకోనున్న నిర్మాణ‌ ప‌నులు

0
AP – మెట్రో రైలుకు గ్రీన్ సిగ్న‌ల్‌! స్పీడందుకోనున్న నిర్మాణ‌ ప‌నులు

డీపీఆర్‌లు రెడీచేసిన ఏపీ స‌ర్కారు
కేంద్రం అనుమతించ‌డ‌మే ఆలస్యం
రెండు దశల్లో రెండు కారిడార్లుగా పనులు
100 శాతం నిధుల బాధ్యత కేంద్ర ప్ర‌భుత్వానిదే
భూ సేకరణ ఖర్ఛంతా రాష్ట్రం ఖాతాలో
₹2,799 కోట్ల భారం భ‌రిస్తామ‌న్న ఏపీ ప్ర‌భుత్వం
విజయవాడ మెట్రోకు సూత్ర‌ప్రాయంగా ఆమోదం
మొదటి, రెండు దశల పనులకు అనుమ‌తి
ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులకు శ్రీకారం
సంతోషం వ్య‌క్తం చేస్తున్న బెజ‌వాడ జ‌నం

ఆంధ్రప్రభ స్మార్ట్‌, ఎన్టీఆర్ జిల్లా బ్యూరో:

బెజవాడ.. అంటే అదొక రాజకీయ వాడ. ఏపీలో రెండో ఆధ్యాత్మిక కేంద్రం. రెండు కొండల మధ్య అవతరించిన తొలి సాగునీటి ఆనకట్ట. జంటనగరాలకు వారధి ఈ బెజవాడ సొంతం. అంతే కాదు. మూడు కాలువలు.. మూడు ప్రధాన రోడ్ల నగరం. అభివృద్ధిలో ప్రభుత్వం ప్రాజెక్టులు ఊసే లేదు. కానీ ఏపీ రాష్ట్ర విభజన సమయంలో.. పునర్విభజన చట్టంలోబెజవాడ తెరమీదకు వచ్చింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం హామీ లభించింది. బెంజిసర్కిల్.. రామవరప్పాడు.. ప్రాంతాల్లో రోడ్ల రద్దీకి తెరపడిందని విజయవాడ నగర ప్రజలు అంతులోని ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈ హామీ పదేళ్లుగా ఊరింత దశలోనే జనానికి బహుదూరమైంది.

తాజాగా కూటమి ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుల పైళ్ల బూజు దులిపింది. విశాఖ పట్నం, విజయవాడ మెట్రో రైళ్ల డీపీఆర్ తయారీలో నిమగ్నమైంది. ఇక నూతన మెట్రో పాలసీలో రాష్ట్రాల్లోని ఏ నగరంలో మెట్రో రైలు అవసరమని భావిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే కేంద్రం మెట్రో ప్రాజెక్టులను నిర్మించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చోటు చేసుకున్న విజయవాడ.. విశాఖ మెట్రోలను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ రెండు ప్రాజెక్టులను పట్టాలపై తీసుకు రావటానికి కేంద్రం సమాయత్తం అవుతోంది. ఈ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ప్రతిపాదనలను అధికారులు రూపొందించారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల పూర్తి ఖర్చు రూ. 42, 362 కోట్లు కాగా.. కేవలం భూ సేకరణ కోసం ఖర్చు మాత్రమే ఏపీ ప్రభుత్వం భరించనుంది.

మెట్రో కార్పొరేషన్ రెడీ
విజయవాడ నగరం.. ఒక రకంగా మహానగరమే. కానీ ఇక్కడ భౌగోళిక పరిస్థితిని పరిశీలిస్తే.. ఈ నగరంలో మూడు ప్రధాన రోడ్లకు ఇరువైపులా నగరం విస్తరించింది. ఒకటి మహాత్మాగాంధీ రోడ్డు ( బందరు రోడ్డు) , కారల్ మార్క్స్ రోడ్డు (ఏలూరు రోడ్డు).. ఇక కోల్కతా ..చెన్నై నేషనల్ హైవే. ఇది గుంటూరు, విజయవాడ జంట నగరాలకు వారధి. ప్రధానంగా ఆసియాలోనే పెద్ద పండిట్ నెహ్రు బస్ స్టేషన్ కేంద్రంగా రెండు కారిడార్ల నిర్మాణం తప్పని సరి . ఈ స్థితిలో ఏ రోడ్డుల్లో తొలి మెట్రో రైలు దూసుకుపోతుంది? ఏ రోడ్లను ఖరారు చేస్తారు? అనే ప్రశ్న ప్రజలను ఉవ్విళ్ళూరిస్తుంటే.. ఇక రియలల్టరు,, గత మూడు మాసాలుగా తమ బిజినెస్ ప్లానుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

తెరమీదకు రెండు కారిడార్లు

ఈ డీపీఆర్ లకు కేంద్రం అనుమతులు రాగానే తొలిద‌శ‌ మెట్రో పనుల ప్రారంభానికి ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్ సిద్దంగా ఉంది. విజయవాడ పండిట్ నెహ్రూ బ‌స్ స్టేషన్ (పీఎన్‌బీఎస్) నుంచి గన్నవరం వరకు 25.85 కిలోమీటర్లలో కారిడార్ 1 పనులు, పీఎన్ఎస్ నుంచి బందరు రోడ్డు మీదుగా పెనమ‌లూరు వరకు 12.45 కిలోమీటర్లలో కారిడార్ 2 కలిపి మొత్తంగా 38. 40 కిలోమీటర్ల మేరకు మెట్రో పనులు ప్రారంభించాలని భావిస్తోంది. కేంద్రం నుంచి అనుమతులు రావటం తథ్యమని భావించిన ప్రభుత్వం తన కార్యాచరణలో వేగం పెంచింది. విజయవాడ, విశాఖ నగరాల్లో కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖ‌ల‌తో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. కారిడార్ మార్గంలో ఆయా శాఖలు తక్షణం చేయాల్సిన పనులను చర్చిస్తారు.

భూసేకరణ సమస్య కాదు

మెట్రో స్టేషన్లకు భూ సేకరణ పనుల్లోనే ప్రభుత్వానికి అసలు సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంది. అది స్వల్పమే. ఎందుకంటే .. విజయవాడ, విశాఖ నగరాల్లో మెట్రో ప్రతిపాధిత ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ ఇప్పటికే జరిగింది. అటు పెనమలూరు నుంచి ఇటు గన్నవరం నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకూ సెంట‌ర్‌ డివైడర్ పై పిల్లర్ల నిర్మాణ పనులకు ఇబ్బందులు లేవు. ఈ స్థితిలో భూసేకరణ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. అందుకే టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు.

విద్యుత్ తీగల అడ్డంకి లేదు

మెట్రో ప్రాజెక్టులు అవగానే విద్యుత్ తీగలు కనిపిస్తుంటాయి. పక్క రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో విద్యుత్ తీగలతో కూడిన ప్రాజెక్టులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విధానం కొనసాగుతోంది ఒక్క కేరళ, ఆ తర్వాత మరో రాష్ట్రం తప్ప ఇంకెక్కడా లేదు. కాగా, విద్యుత్ తీగలు లేని మెట్రోల్లో దేశంలోనే మూడోదిగా విజయవాడ మెట్రోకు ప్రాధాన్యం దక్కనుంది. ఈ మెట్రోలో థర్ట్ విధానాన్ని అనుసరించాలని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ భావిస్తోంది ఈ విధానంలో ట్రాక్ నుంచే విద్యుత్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. తీగలు ఎక్కడా కనిపించవు.

అమరావతి కారిడార్ లో 32 స్టేషన్లు

అమరావతి కారిడార్ లో 32 స్టేషన్లు ఉంటాయి. అన్ని స్టేషన్లు కలిపి 60 వరకు ఉంటాయి. కార్ కోచ్ లు నడుపుతారు. గన్నవరం వద్ద కోచ్ డిపో డిపోను ఏర్పాటు చేయనున్నారు. ఒక మెట్రో రైల్లో 400 నుంచి -450 మంది ప్రయాణించే వీలుంది. జక్కంపూడి వరకు కారిడారు… అక్కడ ఆర్థిక నగరం ఏర్పాటు నేపథ్యంలో 16 కిలో మీటర్ల మేర నిర్మిస్తారు. ఇలా అన్ని చర్చించి సమీక్షించిన పెద్ద మెట్రో డీపీఆర్ ను అధికారులు సిద్ధం చేశారు.

తొలి దశలోనే బెజవాడ కష్టాలు తీరినట్టే

విజయవాడ మెట్రో ప్రాజెక్టులో తొలి దశలో రెండు కారిడార్ల పొడవు 38.40 కిలోమీటర్లు. ఒక కారిడారు పండిట్ నెహ్రూ బస్టాండు నుంచి గన్న వరం వరకు(ఏలూరు రోడ్డు వెంట), మరో కారిడార్ పెనమలూరు వరకు నిర్మిస్తారు. గన్నవరం నుంచి పీఎన్బీఎస్ వరకు కారిడార్ 26 కిలోమీటర్లు ఉంటుంది. మరో కారిడార్ పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు బందరు రహదారిపై ఉంటుంది. దీని దూరం 12.5 కి.మీ ఉంది. ఒక్క స్టేషన్ నిర్మాణానికి సుమారు రూ.25 కోట్లు అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో పీఎన్బీఎస్ నుంచి అమ రావతికి 27.5 కిలోమీటర్ల దూరం కారిడార్ ఉంటుంది. కృష్ణకాలువ జంక్షన్ మీదుగానే వెళ్తుంది. అమరావతి పరిధిలో దాదాపు 5 కి.మీ ఆకాశంలో, 15 కిలోమీటర్ల వరకు భూగర్భంలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇలా అన్ని అనుమతులతో పనులు చకచక సాగి మెట్రో రైల్ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంటే విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గినట్టే.

Exit mobile version